రమ్య కేసులో సంచలన తీర్పు
బిటెక్ విద్యార్థిని రమ్య కేసులో హంతకుడికి ఉరిశిక్ష
గుంటూరు (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బిటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసుపై గుంటూరు జిల్లా స్పెషల్ కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. ఈ కేసులో నిందితుడు శశికృష్ణ హత్య చేసినట్లు ఆధారాలతో సహా రుజువుకావడంతో అతడిని ప్రత్యేక కోర్టు హంతకుడిగా పరిగణిస్తూ ఉరిశిక్ష విధిస్తున్నట్లు తీర్పు వెల్లడించింది. సుధీర్ఘ వాదనల తర్వాత కోర్టు ఇవాళ (శుక్రవారం ) ఉరిశిక్ష విధించింది.
ఈ కేసులో కోర్టు 28 మంది సాక్షుల నుంచి వాంగ్మూలం సేకరించింది. 9 నెలల్లోనే విచారణ పూర్తి చేసి తీర్పును వెల్లడించింది.
ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది… “ ఈ కేసు అరుదైన కేసు్లో అరుదైనదిగా పరిగణించాల్సిన అవసరం ఉందని భావించాం. స్వాతంత్ర్య దినోత్సవం రోజున పట్టపగలు అందరూ చూస్తుండగానే హత్యచేశాడు. అది ఎంతో సంచలనం సృష్టించింది. ఇంత చేసిన నిందితునిలో ఎలాంటి మార్పు రాలేదు. విచారణ జరుగుతుండగానే కోర్టు నుండి పారిపోయేందుకు యత్నించాడు. నిందితుడిలో తప్పు చేశాననే పశ్చాత్తాపం అతనిలో కనిపించడంలేదు.. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని నిందితుడికి ఉరిశిక్ష విధిస్తున్నాం.“ అని తీర్పు వెల్లడించిన సమయంలో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి పేర్కొన్నారు.
ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులతో పాటు డిజిటల్ ఎవిడెన్స్ కీలకంగా మారాయని ఎస్పీ తెలిపారు. పోలీసులు ఈ కేసును ప్రత్యేక శ్రద్ధతో పరిష్కారించార్నారు.
కేసు వివరాల్లోకి వెళ్తే..
తనను ప్రేమించడం లేదని వట్టి చెరుకూరు మండలం ముట్లూరుకు చెందిన కుంచాల శశికృష్ణ (19) ఉదయం 9.40కి టిఫిన్ తీసుకురావడం కోసం ఇంటి నుంచి బయటకు వచ్చిన రమ్యతో గొడవ పడి కత్తితో ఎనిమిది సార్లు పొడిచాడు. సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమైన శశికృష్ణ ప్రేమ పేరుతో రమ్యని వేధించాడు. కేవలం తన ఫోన్ నంబర్ బ్లాక్లో పెట్టిందన్న కోపంతో గత సంవత్సరం ఆగస్టు 15న నడిరోడ్డుపై రమ్యను హత్య చేశాడు. ఈ కేసులో శశికృష్ణను నరసరావుపేట పోలీసులు 24 గంటల్లోపే అదుపులోకి తీసుకున్నారు.. డిఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో పోలీసులు 36 మందిని విచారించి 15 రోజుల్లోనే ఛార్జిషీట్ దాఖలు చేసింది.