అమరావతి రైతుల బహిరంగ సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

అమరావతి (CLiC2NEWS): అమరావతి రైతులకు తిరుపతిలో బహిరంగ సభ నిర్వహణ కోసం హైకోర్టు షరతులతో కూడిన అనుమతినిచ్చింది. డిసెంబరు 17వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నుండి సాయంత్రం 6గంటల వరకు సభ నిర్వహించుకోవాలని ఆదేశించింది. అమరావతి రైతుల న్యాయస్థానం టు దేవస్థానం మహాపాదయాత్ర 44 రోజుల పాటు సాగిన అనంతరం బహిరంగ సభ ఏర్పాటుకు అనుమతి కోరినా.. చిత్తూరు జిల్లా పోలీసులు నిరాకరించారు. బహిరంగ సభకు అనుమతిస్తే ప్రాంతీయ ఘర్షణలు జరిగే ప్రమాదం ఉందని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇంకా కరోనా, ఒమిక్రాన్ వ్యాప్తి కారణంగా బహిరంగ సభకు అనుమతివ్వలేదని అడిషనల్ ఎజి తెలిపారు. ఈ వాదనలన్నీ విన్న న్యాయస్థానం శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా, నిబంధనల మేరకు సభ నిర్వహించుకోవాలని సూచించింది.