‘విటమిన్ డి’ లోపం రాకుండా ఉండాలంటే..
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరిలో తలెత్తే ఆరోగ్య సమస్య విటమిన్ డి లోపం. నీరసంగా ఉంటుంది, ఏ పని చేసుకోలేకపోతున్నామని డాక్టర్ దగ్గరికి వెళితే ముందుగా అన్ని టెస్టులూ చేసి .. నీకు విటమిన్ డి అవసరం, ఎండలో నిలబడాలి అంటూ.. విటమిన్ డి మాత్రలు ఇస్తారు. నగరాల్లో మన శరీరానికి సూర్యరశ్మి తగలాలంటే ఎంత కష్టమో మరి తెలిసిన విషయమే. దానికి తోడు ఈ బిజీ లైఫ్‌లో ఎండలో కొంచెం చేసు నిలుచోవాలంటే కూడా కష్టమే. ఇలాంటి పరిస్థితుల్లో విటమిన్ డి లోపం తలెత్తకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మనం తినే ఆహారంలో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలనే దాని గురించి తెలుసుకుందాం.
సూర్యరశ్మి వలన మన శరీరానికి డి విటమిన్ అందుతుందన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలిసినదే. సూర్యరశ్మి నుండి శరీరం క్యాల్షింను గ్రహిస్తుంది. తద్వారా ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. డి విటమిన్ నాడులు, కండరాల ఆరోగ్యానికి అవసరం. సూర్యకాంతి రోజూ కనీసం పదిహేను నిమిషాలైనా నిలబడాలని నిపుణులు సలహా ఇస్తుంటారు.
విటమిన్ డి ఎముకలను దృఢంగా ఉంచుతుంది. ఈ విటమిన్ లోపం వలన కండరాల బలహీనత, నొప్పులు, కీళ్ల నొప్పులు, అలసట, ఆందోళన, ఒత్తిడి, జట్టు రాలడం, దీర్ఘకాలిక జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. విటమిన్ డి లోపం వలన చిన్నపిల్లల్లో రికెట్స్ వ్యాధి వస్తుంది. దీంతో ఎదిగే పిల్లల్లో కాళ్లు వంకర అవ్వడం, పుర్రె సొట్ట పడటం, ఎముకలు తేలికగా విరగటం, ఎదుగుదలలో లోపాలు, కండరాలలో బలం లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది పెద్దవారిలో ఆస్టియో మలాసియా అనే సమస్య కలుగుతుంది. దీంతో ఆహారంలోని కాల్షియం శోషణ లోపంతో ఎముకలు తేలికగా విరగడం, బలహీనమైన దంతాలు, ఎముకల్లో నొప్పులు, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి సమస్యలు వస్తాయి.
ఊబకాయం, కాలేయ సమస్యలు , మూత్ర పిండాల సమస్యలతో బాధపడేవారిలో విటమిన్ డి సరిగా ఉత్పత్తి కాదు. గర్బంతో ఉన్న తల్లికి ఈ విటమిన్ లోపం ఉంటే ..పుట్టే బిడ్డకు కూడా లోపం వచ్చే అవకాశముంటుందని అంటున్నారు.
మనదేశంలో విటమిన్ డి లోపం అనేది 80% పైనే అని గణాంకాలు తెలుపుతున్నాయి. ఈ లోపాన్ని నివారించేందుకు విటమిన్ డి ని మందు రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే శరీరంలో సత్తువ తగ్గి.. వ్యాధినిరోధక శక్తి నశించిపోతుంది. కొన్ని ఆహారపదార్థాల వల్ల ఈ విటమిన్ లోపాన్ని అధిగమించవచ్చు.
కొన్ని రకాల ఆహారపదార్ధాల్లో విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది. పుట్టగొడుగులు, చేపలు, గుడ్లు, కాడ్ లివర్ ఆయిల్.. వీటిలో డి విటమిన్ అందుతుంది.
పుట్ట గొడుగులు .. వీటిలో విటమిన్ డి స్థాయిలు అధికంగా ఉంటాయి. అంతేకాక బి1, బి2, బి5 , కాపర్ వంటి పోషకాలు కూడా వీటిలో లభిస్తాయి.
గుడ్లు.. గుడ్డులోని పచ్చ సొనలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. కానీ ఇది రోజుకు ఒకటి మాత్రమే తీసుకోవాలి. కొందరు పచ్చ సొన తినకూడదంటారు . ఇది కేవలం అపోహ మాత్రమే. రోజుకు ఒకటి తీసుకోవచ్చంటున్నారు నిపుణులు.
చేపలు.. వీటిలో విటమిన్ డి తో పాటు క్యాల్షియం, ప్రోటీన్లు, ఫాస్పరస్ ..వంటి పోషకాలు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తాయి. సాల్మోన్ వంటి చేపల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయని అంటారు. దీనిలో విటమిన్ డి కూడా అధికంగా ఉంటుంది. ఒమేగా-3 ఫ్యాటి యాసిడ్స్ సమృద్ధఙగా ఉండే ఆహార పదార్ధాలు తీసుకోవాలి. ఫ్యాటి ఫిషెస్ తీసుకుంటే మంచిది.
కాడ్ లివర్ ఆయిల్.. వీటిలో విటమిన్ డి అధదికంగా ఉంటుంది. వీటిలో ఒమేగా-3 ఫ్యాటి యాసిడ్స్ మరియు విటమిన్ ఎ కూడా అందుతుంది.
పాలు.. పాలు, ఛీజ్ వంటి వాటిలో కూడా విటమిన్ డి లభిస్తుంది. ఆవు పాలల్లో విటమిన్ డి అధికంగా ఉంటుంది. రోజుకు ఒక గ్లాసు వెన్నతో కూడిన ఆవుపాలు తాగడం మంచిదంటున్నారు. దీంతో ఒక రోజులో కావాల్సిన మొత్తంలో 20% వరకు డి విటమిన్ ను శరీరానికి అందించవచ్చట.పెరుగులో కూడా ప్రొటీన్లతో పాటు ఈ విటమిన్ అధికంగా లభిస్తుంది. అయితే ఇంట్లో తయారు చేసుకునే పెరుగునే వాడుకోవడం మంచిది.
ఇంకా ఓట్స్ లో కూడా డి విటమిన్ లభిస్తుంది. వీటిలోని అత్యవసర ఖనిజాలు, సంక్లిష్ట కార్బొహైడ్రేట్లు ఆరోగ్యానికి , చక్కటి శరీరాకృతికి దోహదం చేస్తాయి.