Hyderabad: 11 నెలల పసికందును ఢీకొన్న కారు..
కారు యజమాని నిర్లక్ష్యానికి బాలుడు మృతి

హైదరాబాద్ (కొండాపూర్, CLiC2NEWS): కారు యజమాని నిర్లక్ష్యానికి 11 నెలల బాలుడు బలయ్యాడు. తమ కళ్లముందే ఆడుకుంటున్న చిన్నారి అంతలోనే విగతజీవిగా మారిన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం ఎనమదలకు చెందిన తోట వెంకట శివప్రసాద్, అనిత దంపతులకు ఇద్దరు కుమార్తెలు.. భవ్య (5), జాను (4), కుమారుడు జశ్వంత్ (11 నెలలు). 6నెలలకిందట బతుకుదెరువు కోసం హైదరాబాద్‌లోని కొండాపూర్ కు వలస వచ్చారు. శ్రీరామ్‌నగర్ బీ బ్లాక్‌లో నివాసం ఉంటున్నారు. మంగళవారం ఉదయం శివకుమార్ ముగ్గురు పిల్లలు ఇంటి బయట ఆడుకుంటున్నారు. అదే సమయంలో అదే బ్లాక్‌కు చెందిన సివిల్ ఇంజినీర్ తాటి కిరణ్ నిర్లక్ష్యంగా కారును నడుపుతూ జశ్వంత్ (11నెలలు)ను ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన బాలుడిని కొండాపూర్ సర్కార్ దవాఖానకు తీసుకువెళ్లగా వైద్య పరీక్షల నిమిత్తం కొత్తగూడ టెస్లాకు తరలించారు. పరీక్షల అనంతరం దవాఖానకు తీసుకురాగా అప్పటికే బాబు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వెంకట శివప్రసాద్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి కిరణ్‌ను అరెస్టు చేశారు.