జలమండలి కార్యాలయంపై దాడి సరికాదు..

హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని జలమండలి ప్రధాన కార్యాలయంపై భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు మంగళవారం చేసిన దాడికి వ్యతిరేఖంగా జలమండలి వివిధ సంఘాల నాయకులు నిరసన తెలిపారు. ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి, తమకు రక్షణ కల్పించాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఖైరతాబాద్ లోని ప్రధాన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాన కార్యాలయం, మూసాపేట్ సెక్షన్ కార్యాయాల్లో కొందరు ప్రజాప్రతినిధులు దాడి చేయడం సరికాదన్నారు. ఈ దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సంస్థలో దాదాపు 30 శాతం మంది మహిళలు పనిచేస్తున్నారని, ఇలాంటి ఘటనల వల్ల వారు భయాందోళనలకు గురవుతున్నారని తెలిపారు. ఈ ఘటనకు కారకులైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృత్తం కాకుండా కార్యాలయాల్లో రక్షణ కల్పించడానికి సెక్యూరిటీ సిబ్బందిని నియమించాలని ఎండీ దానకిశోర్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ రకంగా చేయడం వారి రాజకీయం చేయడం కోసమే తప్పా.. సమస్యలు పరిష్కరించాలన్న ఉద్దేశం కాదని పేర్కొన్నారు.