అక్రమ నల్లా కనెక్షన్లపై జలమండలి కొరడా.. 44 మందిపై కేసు

హైదరాబాద్ (CLiC2NEWS): జలమండలి సరఫరా చేస్తున్న మంచినీటి పైపులైను నుంచి అక్రమంగా నల్లా కనెక్షన్ పొందిన పలువురు వ్యక్తుల మీద జలమండలి విజిలెన్స్ అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. జలమండలి ఓ ఆండ్ ఎం డివిజన్ – 22 పరిధిలోని తుర్కయంజాల్ సెక్షన్ పరిధిలో నాలుగు అక్రమ నల్లా కనెక్షన్లను తొలగించడంతో పాటు 44 మందిపై కేసు నమోదు చేశారు.
వివరాల్లోకి వెళ్తే… తుర్కయంజాల్‌లోని ప్రగతినగర్ టౌన్‌షిప్‌లోని నివసించే పి.వెంకట్‌రెడ్డి అనే వ్యక్తి తన నివాసానికి 15 ఎంఎం పైప్సైజ్ అక్రమ నల్లా కనెక్షన్ తీసుకున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన జలమండలి విజిలెన్స్ విభాగం అక్రమ నల్లా కనెక్షన్‌ను తొలగించడంతో పాటు అక్రమ కనెక్షన్ తీసుకున్న ఇంటి యజమాని పి.వెంకట్‌రెడ్డి, కనెక్షన్ ఇచ్చిన ప్లంబర్ ఐలయ్యపై వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో యు/ఎస్ 269, 430 ఐపీసీ సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదు చేసింది.
ఇంజాపూర్‌లోని యాపిల్ కాలనీలో గల శ్రీవెంకటేశ్వర నిలయం అనే బహుళ అంతస్తుల భవనానికి 15 ఎంఎం అక్రమ నల్లా కనెక్షన్ తీసుకున్నారు. జలమండలి విజిలెన్స్ అధికారుల తనిఖీలో ఈ విషయం బయటపడింది. దీంతో అక్రమ నల్లా కనెక్షన్ తీసుకున్న ఫ్లాట్ల యాజమానులు సంతోష్ రెడ్డితో పాటు మరో 17 మందిపై వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో యు/ఎస్ 269,430 ఐపీసీ సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు.
ఇంజాపూర్‌లోని యాపిల్ కాలనీలో గల ఉదయశ్రీ ఆర్కేడ్ అపార్ట్‌మెంట్స్‌కు 20 ఎంఎం అక్రమ నల్లా కనెక్షన్ తీసుకున్న విషయాన్ని జలమండలి విజిలెన్స్ విభాగం గుర్తించింది. అక్రమ కనెక్షన్‌ను తొలగించడంతో పాటు అపార్ట్మెంట్ యాజమానులైన సి.ప్రభాకర్‌తో పాటు మరో 22 మందిపై వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో యు/ఎస్ 269,430 ఐపీసీ సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు.
తుర్కయంజాల్‌లోని సూరజ్‌నగర్ ఫేజ్ – 3లో నివసించే కె.కృష్ణయ్య అనే వ్యక్తి తన నివాసానికి అక్రమంగా 15 ఎంఎం నల్లా కనెక్షన్ పొందారు. ఈ విషయాన్ని గుర్తించిన జలమండలి విజిలెన్స్ విభాగం అక్రమ కనెక్షన్‌ను తొలగించడంతో పాటు ఇంటి యాజమాని కె.కృష్ణయ్యపైన ఆదిబట్ల పోలీస్ స్టేషన్లో యు/ఎస్ 269,430 ఐపీసీ సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు.
అధికారుల అనుమతులు లేకుండా అక్రమ నల్లా కనెక్షన్లు తీసుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జలమండలి అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు.
ఎవరైనా అక్రమ నల్లా కనెక్షన్లు గుర్తించినా, డొమెస్టిక్ కనెక్షన్ తీసుకుని కమర్షియల్ అవసరాలకు వినియోగిస్తున్న వారిని గుర్తించినట్లయితే జలమండలి విజిలెన్స్ బృందంకు లేదా 9989998100, 9989992268 నెంబర్లకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగలరని జలమండలి అధికారులు తెలిపారు.