Hyderabad: జలమండలి ఉద్యోగులకు పిఆర్సి అమలు

హైదరాబాద్(CLiC2NEWS): జలమండలి ఉద్యోగులకు పిఆర్సి అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ బుధవారం మెమో నెంబర్ 14059 ద్వారా ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 11.06.2021 నాడు జారీ చేసిన జీవో నెంబర్ 51 ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తున్న పిఆర్సినే యధాతధంగా జలమండలి ఉద్యోగులకు కూడా వర్తించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 01.07.2018 నుంచి ఉద్యోగులకు పిఆర్సిని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జలమండలి ఉద్యోగులకు 01.06.2021 నుంచి పిఆర్సి బకాయిలు కూడా నగదు ద్వారా అందనున్నాయి.
పిఆర్సి-2020 అమలు ద్వారా జలమండలి ప్రతి నెల రూ.12 కోట్లు అదనంగా జీతభత్యాల కింద చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగులకు వారు తీసుకునే జీతం దాదాపు రూ.7 వేల నుంచి రూ.25 వేల వరకు అదనంగా పెరగనుంది. జలమండలిలో పని చేస్తున్న 3,900 మంది ఉద్యోగులకు, 3,200 మంది పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లు, 500 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు పిఆర్సి వర్తిస్తుంది.