అనుమతులు లేని ఇళ్లు.. పెద్దవాళ్లవైనా, పేదలవైనా కూల్చక తప్పదు: కమిషనర్ రంగనాథ్
హైదరాబాద్ (CLiC2NEWS): అక్రమ నిర్మాణాల విషయంలో మానవత్వంతో ఆలోచిస్తే సమాజమంతా బాధపడాల్సి వస్తుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. నగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజల్లో ఎఫ్టిఎల్, బఫర్ జోన్లపై అవగాహన వచ్చిందని, దీనిపై చర్చ జరుగుతోందన్నారు. ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలు తొలగించడంతో పాటు, చెరువుల్లోకి కొత్త నిర్మాణాలు రాకుండా చూడటం తమ బాధ్యత అన్నారు. చెరువులో నీటి విస్తీర్ణం, సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్లు , విలేజ్ మ్యాప్లు కూడా పరిగణనలోకి తీసుకుంటామన్నారు. చెరువులను పునరుద్దరించాలంటే ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్నారు.
అక్రమ నిర్మాణాల నియంత్రణకు అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నట్లు రంగనాథ్ వెల్లడించారు. కొంతమందిపై చర్యలు తీసుకోవడం వలనే హైడ్రా గురించి అందరికీ తెలిసిందని, ప్రజల్లో అవగాహన వచ్చిందన్నారు. చెరువులు ఆక్రమణకు గురికాకుండా స్థానికులు కూడా నిఘా పెడుతున్నారన్నారు. అమీన్పూర్ చెరువు తూములు మూసివేయడం వల్లే లేఅవుట్లు మునిగాయన్నారు. ఎఫ్టిఎల్ లెవెల్ పరిగణలోకి తీసుకొని చెరువుల సర్వే చేయిస్తాం. ఎఫ్ టిఎల్ పరిధి నిర్ధరించాక ఏదైనా నిర్మాణం చేపడితే అలర్ట్ వస్తందని ఆయన తెలిపారు.
అనుమతులు లేకుండా ఉన్న ఇళ్లు.. పెద్దవాళ్లవైనా , పేదలవైనా కూల్చక తప్పదన్నారు. తప్పుడు అనుమతులు ఇచ్చినవి, అనుమతులు రద్దు చేసిన ఇళ్లను మాత్రమే హైడ్రా కూల్చివేసిందిన్నారు. కొన్ని సార్లు మనుసును చంపుకొని పని చేయాల్సి వస్తుందని రంగనాథ్ తెలిపారు.