తిరుపతిలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు

తిరుపతి (CLiC2NEWS): జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 పోలీసు యాక్టు అమలులో ఉన్నట్లు జిల్లా ఎస్‌పి సుబ్బారాయుడు వెల్లడించారు. శాంతి భద్రతల పరిరక్షణలో బాగంగా నెలరోజులపాటు (అక్టోబర్ 24వరకు) ఆంక్షలు అమలులో ఉండనున్నట్లు సమాచారం. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వివాదం.. దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా తిరుమల, తిరుపతి తదితర ప్రాంతాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. పోలీసు శాఖ నుండి అనుమతి లేకుండా సభలు, భేటీలు, ఊరేగింపులు నిర్వహించొద్దని ఆంక్షలు విధించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.