క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించండి: హైకోర్టు

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించాలని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో వేడుకలలో జనం గుమిగూడకుండా ఆంక్షలు విధిస్తూ రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వలు జారీ చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయని, ప్రభుత్వ, రాజకీయ కార్యక్రమాలు, సంప్రదాయ వేడుకల్లో మాస్కులు ధరించడం వంటి కనీస జాగ్రత్తలు ప్రజలు పాటించటం లేదని కొందరు న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన ధర్మాసనం విచారణ చేపట్టింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ తుకారాంజి ధర్మాసనం క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి వేడుకలను నియంత్రించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఢిల్లి, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాయని విచారణ సందర్భంగా ప్రస్తావించింది.