నేడు జాతీయ రైతు దినోత్సవం..

తాను మోసపోవడమే తప్పా ఇతరులను మోసాగించని తత్వవేత్త మన రైతన్న. …

మనకు రోజు ఆహారం అందుతున్నదంటే అది రైతుల ఘనతే.ఆరుగాలం కష్టపడుతున్న రైతన్నలకు సదా వందనం.
సెలవు లేకుండా పని చేస్తున్న రైతన్నలారా మీ రుణం తీర్చుకునేదెలా?.తొలకరి వానకు మురిసి పోయే రైతన్న మోము.. ..
అలా అలా దుక్కిదున్నుతూ విత్తనం విత్తినప్పుడు ఆనందంగా ఉంటాడు.ఇక అప్పటినుంచి ఆశల పల్లకిలో విహరిస్తూ ఆకాశం వంక చూస్తూ అలసి, సొలసి ఆ చెట్టుకిందే పడుకోవటం రైతన్నలకు అలవాటే.ఇలా ఒక పంటే కాదు పత్తి,మిర్చి,పసుపు,వరి ఇలా వివిధ పంటలు వేసే ప్రతీ రైతన్నదీ నిత్యపోరాటమే.విత్తనం వేసింది మొదలు పంట చేతికి వచ్చే వరకు రైతన్నకు నిత్యం ఆరాటమే.దీనికి తోడు ప్రకృతి కూడా రైతన్నతో చేలగాటమే ఆడుతుంది.వేలాది మంది కడుపు నింపే రైతన్నకు పచ్చడి మెతుకులు కూడా కరువే. తాను మండుతూ లోకానికి వెలుగు లిచ్చే దీపంలా. …
స్వాతంత్రం వచ్చినప్పటి నుంచీ రైతే రాజు అంటూ నినదిస్తున్న వివిధ ప్రభుత్వాలు రైతన్నల బాధలను పట్టించుకున్న పాపాన పోలేదు. అయినా రైతులు తమపని తాము చేసుకొని పోవటమే తప్పా ఏనాడు తిరుగుబాటు చేయలేదు.నాసిరకం విత్తనాలు,కల్తీ మందులు,సాగు నీరు కోసం తిప్పలు ప్రతీసారి మనం వింటున్న వార్తలే.అయినా మనపాలకులు వ్యవసాయ సంస్కరణలు అంటూ,రైతులకు తాయిలాలు. ..కొన్ని ఉచిత పథకాలు ప్రకటించటం పరిపాటిగా మారింది.నిజంగా రైతు కోరుకుంటున్నదేమిటి అని ప్రభుత్వాలు గుర్తించటం లేదు.రైతుల,వ్యవసాయ నిపుణుల అభిప్రాయాలు తీసుకోవటం లేదు.సరైన సూచనలు,లక్ష్యాలను కూడా ప్రభుత్వాలు అందించటం లేదు.ఇప్పుడు అందిస్తున్నవి కూడా కంటి తుడుపుగా ఉన్నాయి.వాణిజ్య పంటలు వేయాలి అని ప్రభుత్వాలు చెపుతున్నాయి. ఇలా సంపన్న వర్గాల రైతులకు (కార్పొరేట్ రైతులు ..నేను వ్యవసాయదారుడిని నేను వాణిజ్య పంటలతో కోట్లు సంపాదించా అనేవారు) లాభం కలిగిస్తున్నాయి. రైతుకు సిరుల పంట అంటూ వూదర గొడుతున్నాయి.అలా ప్రచార ఆర్భాటాలకు పోయి ఎంతో మంది పత్తి రైతులు వెలుగు చుక్కల్లో కల్సిపోతున్న,పోయిన ఘటనలు ఎన్నో,ఎన్నెన్నో.దీనికి కారణం వివిధ విత్తన,ఎరువుల కంపెనీలు రైతును ఓ వ్యవసాయ వినియోగదారునిగా మార్చాయి.ప్రభుత్వాలు కూడా నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నాయి.ఆయా దేశాలలో నిషేధించిన విత్తనాలను మన దేశంలో అమ్మటం కోసం తలుపులు తెరిచి స్వాగతం పలుకుతున్నాయి.ఇలా రైతు గోసల గురించి రాయాలంటే ఓ పెద్ద రామాయణంమే అవుతుంది.


ఇప్పటికయినా రైతులు డిమాండ్ చేస్త్తున్న మాదిరిగా నకిలీ విత్తనాలు రాకుండా చూడవలసిన బాధ్యత,గిట్టుబాటు ధర ఇవ్వాల్సిన కర్తవ్యం ప్రభుత్వాలదే. మన దేశం ఇప్పటికే వ్యవసాయిక దేశమే.రైతులను కాపాడుకుంటేనే మనకు అభివృద్ధి సాధ్యం.మన దేశ సంప్రదాయ పంటలతో పాటు వాణిజ్య పంటలపై రైతులకు అవగాహన కల్పించాలి రాయితీలకన్నా రైతును మోసగిస్తున్న వారిని కఠినంగా శిక్షించేలా చట్టాలను అమలు చేయాలి.ఉద్దీపన పధకాలను పక్కన పెట్టి వ్యవసాయ ఉద్యమం తీసుకురావాలి.ఇటీవల కరోనా సోకటం తో ఎంతో మంది యువకులు వ్యవసాయం వైపు మళ్లారు.స్వల్పకాలంలోనే లాభాలపంటలువేసిన కథలు నిజంగా మనం చూసాం.యువత వ్యవసాయం వైపు మర్లటం నిజంగా హర్షణీయం.ఇలా యువతను ఆకర్షించడం,వ్యవసాయం అంటే ఇదొక ఉత్పత్తి కేంద్రం అనే నమ్మకం కల్పించాలి.అందుకు అనువయిన సౌకర్యాలను కల్పించాలి. గతంలో నీరుకోసం నెర్రెలు పడిన నేలల్లో నేడు నీటిధారలు పొరలి పొంగుతున్నాయి.ఇక వ్యవసాయాన్ని కొత్తపుంతలకు దారితీసేలా సేద్యం చేయించడం ప్రభుత్వాల కర్తవ్యం.అప్పుడే రైతు దినోత్సవాలకు ప్రాధాన్యం.
కృషితో నాస్తి దుర్భిక్షం
రైతన్నలకు శతకోటి వందనాలతో…

ఎస్.వి రమణా చారి,
సీనియర్ జర్నలిస్ట్,
9 8 4 9 8 8 7 0 8 6

Leave A Reply

Your email address will not be published.