India Corona: 4 లక్షలు దాటిన కేసులు

న్యూఢిల్లీ (CLiC2NWS): కరోనా మహమ్మారి కాటుతో యావత్ దేశం అల్లాడిపోతోంది. దేశం నలుమూలలా వైరస్ విరుచుకుపడుతోంది. దేశవ్యాప్తంగా రోజురోజుకూ కేసులు, మరణాల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది. ప్రపంచంలో తొలిసారిగా.. భారత్‌లో నిన్న రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు రికార్డు స్థాయిలో మరణాలు నమోదయ్యాయి.
దేశంలో కరోనా కేసులు 4 లక్షలు దాటాయి. ఒక్కరోజులో 4 లక్షలకుపైగా కేసులు నమోదవడం ప్రపంచంలో ఇదే తొలిసారి. అదేవిధంగా వరుసగా నాలుగోరోజూ మూడు వేలకు పైగా మరణాలు సంభవించాయి.
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 4,01,993 మంది కరోనా పాజిటివ్‌లుగా నిర్ధారణ అయ్యారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,91,64,969కు చేరింది. ఇందులో 1,56,84,406 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 2,11,853 మంది మరణించారు. మరో 32,68,710 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
కొత్తగా 2,99,988 మంది డిశ్చార్జీ అయ్యారని, కరోనాతో 3523 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
కొత్తగా నమోదైన కేసుల్లో మహారాష్ట్రలో అత్యధికంగా 62,919 కేసులు, కర్ణాటకలో 48,296, కేరళలో 37,199 చొప్పున నమోదయ్యాయి.
నిన్న ఒక్కరోజే మహారాష్ట్రలో కరోనాతో 828 మంది మరణించగా, ఢిల్లీలో 375 మంది, ఉత్తరప్రదేశ్‌లో 332 మంది మృతిచెందారు.
దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. వ్యాక్సినేషన్ ఇప్పటివరకు దేశవ్యాప్తంగా.. 15,49,89,635 డోసులను పంపిణీ చేశారు. కాగా.. నేటి నుంచి భారీ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభం కానుంది. 18 ఏళ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.