ఆ బాలుడికి ఎల‌క్ట్రిక్ వీల్ ఛైర్ కొనిస్తా.. ఇండిగో సిఈఓ

ఢిల్లీ (CLiC2NEWS): భ‌యాందోళ‌న‌తో ఉన్నాడ‌న్న కార‌ణంగా దివ్యాంగ బాలుడిని విమానంలోకి రానివ్వ‌ని ఘ‌ట‌న‌పై ఇండిగో సిఈఓ రోనోజాయ్ దత్త విచారం వ్య‌క్తం చేశారు. త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల‌లో త‌మ సిబ్బంది ఆ నిర్ణ‌యం తీసుకున్నార‌ని వ‌చ్చింద‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా స‌ద‌రు బాలుడికి ఎల‌క్ట్రిక్ వీల్ ఛైర్ కొనిస్తాన‌ని తెలిపారు.

“ఆ కుటుంబాన్ని విమానంలో తీసుకెళ్లాల‌న్న ఉద్దేశంతోనే చెక్‌-ఇన్‌, బోర్డింగ్ ప్ర‌క్రియ చేప‌ట్టాం. అయ‌తే బోర్డింగ్ ఏరియా వ‌ద్ద ఆ బాలుడు భ‌యాందోళ‌న‌తో క‌న్పించాడు. మా క‌స్ట‌మ‌ర్ల‌కు మ‌ర్యాద‌పూర్వ‌క‌మైన సేవ‌లు అందించ‌డ‌మే మా ప్ర‌థ‌మ ప్రాధాన్యం. అయితే ఆ స‌మ‌యంలో భ‌ద్ర‌తా మార్గ‌ద‌ర్శ‌కాల‌ను దృష్టిలో ఉంచుకొని త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో మా సిబ్బంది క‌ఠిన‌మైన నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చింది. ఈ దుర‌దృష్ట‌క‌ల అనుభ‌వాన్ని ఎదుర్కొన్న ఆకుటుంబం ప‌ట్ల ప‌శ్చాత్తాపం వ్య‌క్తం చేస్తున్నాం. దివ్యాంగ చిన్నారుల కోసం త‌మ జీవితాల‌ను అంకితం చేస్తోన్న త‌ల్లిదండ్రులు ఈ స‌మాజానికి నిజ‌మైన హీరోలు. ఆ త‌ల్లి దండ్రుల అంకిత‌భావానికి అభినంద‌గా ఆ బాలుడికి ఒక ఎల‌క్ట్రిక్ వీల్ ఛైర్ కొనివ్వాల‌ని అనుకుంటున్నాం” అని ఇండిగో సిఈఓ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించారు.

హైద‌రాబాద్ వెళ్లేందుకు రాంచీ విమానాశ్ర‌యానికి వ‌చ్చిన దివ్యాంగ చిన్నారితో క‌లిసి కుటుంబం వ‌చ్చింది. ఆ బాలుడు విమానం ఎక్కేందుకు ఇండిగో సిబ్బంది నిరాక‌రించారు. చిన్నారి భ‌యాందోల‌న‌తో ఉన్నాడ‌ని.. దాని వ‌ల్ల ఇత‌ర ప్ర‌యాణికుల‌కు ఇబ్బంది క‌లుగుతుంద‌నే కార‌ణంతో విమానం ఎక్క‌నివ్వ‌లేదు. ఈ ఘ‌ట‌న సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో డిజిసిఎ విచార‌ణ‌కు ఆదేశించింది. కేంద్ర పౌర విమాన‌యాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా దీనిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ వ్య‌వ‌హారంపై తానే స్వ‌యంగా ద‌ర్యాప్తు చేప‌డ‌తాన‌ని తెలిపారు.

దివ్యాంగ చిన్నారిని విమానంలోకి నిరాక‌రించిన ఇండిగో సిబ్బంది…

Leave A Reply

Your email address will not be published.