‘జగనన్న విదేశీ విద్యాదీవెన’ పథకం: మార్గ దర్శకాలు విడుదల
కోర్సు మధ్యలో ఆపేస్తే.. సొమ్ము మొత్తం తిరిగి కట్టాల్సిందే!
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ‘జగనన్న విదేశీ విద్యాదీవెన” పథకం అమలుకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. విదేశాల్లో ఉన్నత చదువులు చదివేందుకు ఆర్థిక సాయాన్ని అందించే ఉద్దేశ్యంతో ఈ పథకం రూపొందించబడింది. ఈ పథకం కింద అర్హులైన విద్యార్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించిన విషంయం తెలిసినదే. తాజాగా ప్రభుత్వం పథకం అమలుకు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆర్ధిక సాయాన్ని పొందిన విద్యార్థులు.. ఏదైనా కారణం చేత కోర్సును మధ్యలో ఆపేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సొమ్ము మొత్తం తిరిగి చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. దీనికి కట్టుబడి ఉంటామని సదరు విద్యార్థి రూ. 100 స్టాంపు పేపరు మీద రాసి ఇవ్వాల్సి ఉంటుంది. వార్షిక ఆదాయం రూ. 8 లక్షల లోపు ఉన్న వారికే ఈ పథకం వర్తిస్తుందని, స్థానికి సచివాలయంలో తీసుకున్న ఆదాయ పత్రాన్ని కలెక్టరు ధ్రువీకరించాల్సి ఉంటుంది. విద్యార్థి కుటుంబ సభ్యులు ఎవరైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే ఇటువంటి పథకాల్లో ఇప్పటికే ఎటువంటి లబ్ధి పొందలేదని ధ్రువీకరణ ఇవ్వాల్సి ఉంటుందది. ఇప్పటికే విదేశాల్లో చదువుకుంటున్న వారికి ఈ పథకం వర్తించదు.
పిజి, పిహెచ్‌డి, ఎంబిబియస్ అభ్యసించాలనుకునే ఎస్సి, ఎస్టి, బిసి, మైనారిటి, ఇబిసి, కాపు విద్యార్థులకు విదేశీ యూనివర్సిటీలు లేదా విద్యాసంస్థలల్లో విద్యనభ్యసించేందుకు ఈ పథకం కింద ఆర్ధిక సాయం అందిస్తోంది. ప్రపంచంలోని టాప్ `100లోపు ర్యాంకు గల విశ్వవిద్యాలయాలు లేదా విద్యాసంస్థల్లో అడ్మిషన్ పొందితే ప్రభుత్వమే 100% ఫీజు చెల్లిస్తుంది. 101 నుండి 200 లోపు ర్యాంకు కలిగిన వాటిలో అడ్మిషన్ పొందితే రూ. 50 లక్షలు లేదా 50% ఫీజును.. ఈ రెండిటిలో ఏది తక్కువ అయితే అది ప్రభుత్వమే భరిస్తుంది.
తప్పకచదవండి: ‘జగనన్న విదేశీ విద్యాదీవెన’ పథకం: దరఖాస్తులకు ఆహ్వానం