ఎస్టీపీల నిర్మాణ పనులపై జలమండలి ఎండీ దానకిశోర్ సమీక్ష
అక్టోబరు నాటికి పూర్తి కావాలి

హైదరాబాద్ (CLiC2NEWS): సీవరేజి ట్రీట్‌మెంట్ ప్లాంట్ల(ఎస్‌టీపీల) నిర్మాణాన్ని వేగవంతం చేయాలని జలమండలి ఎండీ దానకిశోర్ పేర్కొన్నారు. నగరంలో 100 శాతం మురుగునీటి శుద్ధి లక్ష్యంగా రూ.3,800 కోట్లతో 31 కొత్త ఎస్టీపీల నిర్మాణాన్ని జలమండలి ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పనుల పురోగతిపై బుధవారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో ఎండీ దానకిశోర్ సమీక్ష నిర్వహించారు. అన్ని ఎస్టీపీల నిర్మాణ పురోగతిని విడివిడిగా సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అక్టోబరు నాటికి ఎస్టీపీల నిర్మాణాన్ని పూర్తి చేయాలని, ఈ మేరకు పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. అన్ని ఎస్టీపీల వద్ద మూడు షిఫ్టుల్లో పనులు జరిగేలా చూడాలని, రాత్రి వేళల్లో పనులు జరుగుతున్నప్పుడు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్మికుల భద్రతకు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అలాగే, ప్రతి ఎస్టీపీ ప్రాంగణంలో సీసీ కెమెరాలను ఏర్పాటుచేసి ప్రధాన కార్యాలయానికి అనుసంధానం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
ఎస్టీపీల నిర్మాణంలో కీలకమైన ఎస్బీఆర్(సీక్వెన్షల్ బ్యాచ్ రియాక్టర్), సీసీటీ(క్లోరిన్ కాంటాక్ట్ ట్యాంక్), తదితర పనులను ఏకకాలంలో జరపడం ద్వారా నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని నిర్మాణ సంస్థలకు సూచించారు. నిర్మాణాలు జరుగుతున్న ప్రదేశాల్లో చుట్టు పక్కల ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జలమండలి ఈడీ డా.ఎం.సత్యనారాయణ, ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్ బాబు, ఎస్టీపీల సీజీఎంలు, జీఎంలు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.