మొదుడులోని కణుతులను ఎటువంటి శస్త్ర చికిత్స లేకుండా నయం చేసే యంత్రం..

హైదరాబాద్ (CLiC2NEWS): మెదడులోని కణుతులను శస్త్ర చికిత్స చేయకుండా రేడియేషన్‌తో నయం చేసే గామా నైఫ్ అనే రేడియేషన్ యంత్రాన్ని కిమ్స్ ఆస్పత్రి అందుబాటులోకి తెచ్చింది. మెదడులోని అతి చిన్న క్యాన్సర్, క్యాన్సర్ రహిత కణుతులను తొలగించేందుకు తలపై ఎటువంటి కోత, రక్త స్రావం లేకుండానే గామా నైఫ్ సాయంతో రేడియేషన్ ఇచ్చి పూర్తిగా తగ్గించవచ్చని ఆస్పత్రి ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు తెలిపారు.
చీఫ్ గామా నైఫ్ రేడియో సర్జరీ డైరెక్టర్ (న్యూయార్క్) డాక్టర్ ధీరేంద్ర ప్రసాద్, కన్సల్టెంట్ న్యూరో సర్జన్ డాక్టర్ మానస పాణిగ్రహి, కన్సల్టెంట్ న్యూరో సర్జన్ డాక్టర్ చంద్ర శేఖర్ నాయుడు, కిమ్స్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సంబిత్ సాహు, డాక్టర్ జోసెఫ్ మీడియాతో మాట్లాడారు.
మెదడులోని పలు భాగాలు, పిట్యూటరిలోని 2.5 సెంటీమీటర్లు, అంతకంటే చిన్న కణుతులను గామా నైఫ్‌తో నయం చేయవచ్చు. గామా నైఫ్ టెక్నాలజి ద్వారా ఒకటి లేదా రెండు రోజుల వ్యవధిలోనే చికిత్స తీసుకొని వెళ్లి పోవచ్చని తెలిపారు. 95% మందికి ఒకే సిటింగ్‌లో రేడియేషన్ సరిపోతుందన్నారు.
ముధుమేహం, అధిక రక్తపోటు, హృదయ సంబంధ సమస్యలు , వృద్దాప్యంతో బాధపడుతున్న వారికి గామా నైఫ్ చికిత్స ఉపయోగపడుతుందని డాక్టర్ మానస పాణిగ్రహి తెలిపారు.
డాక్టర్ చంద్రశేఖర్ నాయుడు మాట్లాడుతూ.. ముఖానికి ఒకవైపు వచ్చే తీవ్రమైన విద్యుత్ షాక్ లాంటి నొప్పి( బైజెమినల్ న్యూరల్జియా) , మెదడులో ధమనులు, సిరలు ఒకదానికొకటి చుట్టుకొని కలసిపోవడం ( ఆర్టెరియో వీనస్ మాల్ఫార్మేషన్) లాంటి తీవ్రమైన సమస్యలను గామా నైఫ్ తో నయం చేయవచ్చని వివరించారు.