గుండె సంతోషంతో ఉప్పొంగింది

డ‌బుల్ బెడ్రూం ఇళ్ల‌ను ప్రారంభించిన మంత్రి కెటిఆర్‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): `ఇల్లు గ‌ట్టుడు… పెళ్లి చేసుడు` బాధ్య‌త‌ల‌ను పేద‌ల‌పై భారం ప‌డ‌కుండా ముఖ్య‌మంత్రి కెసిఆర్ తీసుకున్నార‌ని రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ వెల్ల‌డించారు. హైద‌రాబాద్‌ పివి మార్గ్‌లో నూత‌నంగా నిర్మించిన 330 డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌ను శ‌నివారం ఉద‌యం మంత్రులు కేటీఆర్, మ‌హ‌ముద్ అలీ, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ క‌లిసి ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. అంబేడ్క‌ర్ న‌గ‌ర్ రూపురేఖ‌లు పూర్తిగా మారిపోయాయ‌ని అన్నారు. ఇంత అద్భుత‌మైన ఇండ్లు నిర్మించి ఇస్తార‌ని అనుకోలేద‌ని స్థానికులు చెబుతున్నారు. ఇదే స్థ‌లంలో ప్ర‌యివేటు అపార్ట్‌మెంట్‌ క‌ట్టి ఉంటే కోటిన్న‌ర అయి ఉండేద‌ని, కానీ ఒక్క పైసా తీసుకోకుండా సీఎం కేసీఆర్ ఇండ్లు నిర్మించి ఇచ్చారు అని ఆడ‌బిడ్డ‌లు చెబుతున్న మాట‌ల‌తో గుండె సంతోషంతో ఉప్పొంగిపోయింది అని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. అంబేడ్క‌ర్ న‌గ‌ర్ వాసుల‌కు బ‌స్తీ ద‌వ‌ఖానాతో పాటు ఫంక్ష‌న్ హాల్ నిర్మించి ఇస్తాం. అవ‌స‌ర‌మైతే ఇంకొన్ని ఇండ్లు క‌ట్టిస్తామ‌ని కేటీఆర్ చెప్పారు.

గూడు క‌ల్పించ‌డం సంతోషంగా ఉంది: త‌ల‌సాని
డ‌బుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం కొంత ఆల‌స్య‌మైనా, పూర్తి ఉచితంగా పేద‌ల‌కు గూడు క‌ల్పించ‌డం సంతోషంగా ఉంద‌ని మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ తెలిపారు. కొంద‌రు కోర్టుల‌కు వెళ్లి అడ్డుకునే య‌త్నం చేశార‌ని మండిప‌డ్డారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్సీ సుర‌భి వాణీదేవి, జీహెచ్ఎంసీ మేయ‌ర్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మి, డిప్యూటీ మేయ‌ర్ మోతె శ్రీల‌త రెడ్డితో పాటు ప‌లువురు కార్పొరేట‌ర్లు, అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.