Kukatpallyలో కాల్పుల కలకలం
నగదు దోచుకెళ్లిన దుండగులు

హైదరాబాద్(CLiC2NEWS): తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో కాల్పుల ఘటన కలకలం రేపింది. కూకట్‌పల్లిలోని ఎటిఎం సిబ్బందిపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపి నగదును దోచుకెళ్లారు. స్థానిక పటేల్‌కుంట పార్కు సమీపంలో ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎం వద్ద గురువారం మధ్యాహ్నం సిబ్బంది డబ్బులు నింపేందుకు వెళ్లారు. ఎటిఎం మిషన్‌లో డబ్బులు నింపుతుండగా ఆల్విన్ కాలనీ వైపు నుంచి పల్సర్ బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతుకులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. అనంతరం వారి వద్ద ఉన్న రూ. 5 లక్షల డబ్బును దోచుకెళ్లారు. దుండగులు జరిపిన కాల్పుల్లో ఎటిఎం సిబ్బంది ఆలీ బేగ్, శ్రీనివాస్ తీవ్రంగా గాయపడ్డారు.గాయపడిన వారిని స్థానికులు, పోలీసులు అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అలీ బేగ్ మృతిచెందాడు. శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఘటనాస్థలిని పరిశీలించిన సీపీ సజ్జనార్
కూకట్‌పల్లి కాల్పుల ఘటనాస్థలిని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఏటీఎంలో రీఫిల్ చేస్తున్న రూ. 5 లక్షల నగదును ఇద్దరు దుండగులు ఎత్తుకెళ్లారని తెలిపారు. ఏటీఎం వ్యాన్‌ను ఫాలో అవుతూ దుండగులు ఈ దారుణానికి పాల్పడినట్లు సీపీ పేర్కొన్నారు. ఘటనాస్థలిలో రెండు బుల్లెట్లు, బుల్లెట్ లాక్, హెల్మెట్‌తో పాటు కొన్ని కీలక ఆధారాలు సేకరించామని స్పష్టం చేశారు. దుండగుల కోసం చెక్‌పోస్టుల వద్ద పోలీసులను అప్రమత్తం చేశామని సీపీ స్పష్టం చేశారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామన్నారు.