అధికారులపై దాడి హేయమైన చర్య: ఉద్యోగుల జెఎసి ఛైర్మన్
హైదరాబాద్ (CLiC2NEWS): అధికారులపై దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఉద్యోగుల జెఎసి ఛైర్మన్ అన్నారు. వికారాబాద్ జిల్లాలో కలెక్టర్, అదనపు కలెక్టర్, ఇతర రెవెన్యూ అధికారులపై స్థానికులు దాడికి పాల్పడ్డారు. జిల్లాలోని దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీ భూసేకరణ ప్రక్రియలో భాగంగా వచ్చిన అధికారులపై దాడికి ఉసిగొల్పిన , దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరుగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు.
దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో ఫార్మా సంస్థ ఏర్పాటుకు సంబంధించి భూసేకరణ కోసం రైతులతో ప్రభుత్వం సంప్రదింపులు సాగిస్తుంది. రైతులు కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించేందుకు గ్రామ శివారులో ఏర్పాట్లు చేశారు. అందుకోసం వికారాబాద్ జిల్లా కలెక్టర్ , కొడంగల్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటి (కడా)ప్రత్యేకాధికారి, అదనపు కలెక్టర్ , సబ్ కలెక్టర్ వచ్చారు. ఈ కార్యక్రమానికి వెళ్లకుండా రైతులు లగచర్లలోనే ఉన్నారు. గ్రామనికి చెందిన ఓ వ్యక్తి సభా వేదిక వద్దకు వచ్చి.. రైతులంతా ఊరిలో ఉన్నారని, అక్కడే ప్రజాభిప్రాయసేకరణ నిర్వహించాలని తెలిపాడు. దీంతో అధికారులంతా అక్కడికి బయల్దేరారు. వారు గ్రామానికి చేరుకోగానే రైతులు ఒక్కసారిగి కర్రలతో , రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. కడా ప్రత్యకాధికారి వెంకట్రెడ్డికి గాయాలయ్యాయి.