Lockdown: కేరళ లో జూన్ 9 వరకు పొడిగింపు

తిరువనంతపురం (CLiC2NEWS): కేరళ రాష్ట్ర సర్కార్ మరో 10 రోజుల పాటు లాక్డౌన్ను పొడిగించింది. అత్యవసరమైన కార్యకలాపాలకు కొంత సండలింపులు ఇస్తూ.. జూన్ 9వ తేదీ వరకు లాక్డౌన్ను పొడిగిస్తున్నట్లు సీఎం పినరయి విజయన్ వెల్లడించారు. కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ ఆంక్షలను తొలగించే దశకు చేరుకోలేదని సిఎం స్పష్టం చేశారు. కరోనా కట్టడికోసం ఈ నెల 31 నుంచి జూన్ 9 లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు తెలిపారు.
కేరళ రాష్ట్రంలో కొవిడ్ మహమ్మారి కేసులు విజృంభిస్తుండటంతో మే 8న ప్రభుత్వం లాక్డౌన్ అమలులోకి తీసుకువచ్చింది. అనంతరం 16న, 23న మరోసారి పొడగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. తాజాగా మరోసారి లాక్డౌన్ను పొడిగించింది.
ఆంక్షలతో కూడిన మినహాయింపులు..
పారిశ్రామిక సంస్థలకు సరఫరా చేసే దుకాణాలు మంగళవారం, గురు, శనివారాల్లో సాయంత్రం 5 గంటల వరకు.. సోమ, బుధ, శుక్రవారాల్లో సాయంత్రం 5 గంటల వరకు బ్యాంకులు తెరిచేందుకు అనుమతి ఇచ్చారు. పుస్తకాలు, బట్టల, ఆభరణాలు, చెప్పుల దుకాణాలు సోమ, బుధ, శుక్రవారాల్లో సాయంత్రం 5 గంటల వరకు తెరచుకోవచ్చని, కొవిడ్ నిబంధనలు పాటించాలని ఆదేశించారు.