Mancherial: కొంప ముంచిన వీధి నాటకం?

మంచిర్యాల (CLiC2NEWS): జిల్లా వ్యాప్తంగా గ్రామ గ్రామాల్లో దండోరా వేస్తున్నారు అధికారులు. ఇంతకీ మంచిర్యాల జిల్లాలో ఏం జరిగింది? పల్లెల్లో దండోరా వేయాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి అంటే.. చెన్నూరూ మండలంలో జరిగిన ఓ ఘటనే ఈ దండోరాకు ప్రధాన కారణమైంది. వీధి నాటకం.. ఈ పేరు వింటే చాలూ ఊళ్లల్లో కొంతమందికి పూనకం వచ్చేస్తుంది. మొదలుపెట్టక ముందే వేదిక ప్రాంగణానికి వెళ్లిపోతారు. చెవులు రెక్కించి మరీ నాటకాన్ని ఆసాంతం ఆలకిస్తారు. కానీ అదే నాటకం.. ఊరు ఊరంతటినీ క్వారంటైన్ చేసింది.
వీధి నాటకం గ్రామాన్ని ముంచింది. ఎంతో జాగ్రత్తగా ఉన్న ఆ గ్రామస్తులకు వీధి నాటకం ప్రదర్శన కరోనాను అంటబెట్టింది. దీంతో గ్రామంలో విపరీతంగా కేసులు. గ్రామ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. చెన్నూరు మండలంలోని సుందరసాల గ్రామంలో, 15 రోజుల క్రితం 5 రోజుల పాటు వీధి నాటకం ప్రదర్శన నిర్వహించారు. దీన్ని తిలకించేందుకు చిన్నా, పెద్దా తేడా లేకుండా గ్రామస్తులంతా ఎగబడ్డారు. ఇప్పుడు అదే వారిని కొంపముంచింది. ప్రదర్శన కారుల్లో కరోనా వైరస్ ఉండగా అది క్రమక్రమంగా ఒక్కొక్కరికీ అంటుకుంది.
ప్రదర్శన రాత్రి 7 గంటల నుంచి తెల్లవారే వరకు కొనసాగడం, క్రమం తప్పకుండా ఐదు రోజులు సాగడం, ప్రదర్శన చూసేందుకు వచ్చిన వారంతా మాస్కులు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా గుంపులు గుంపులుగా ఒకే చోట కూర్చుని వీక్షించడంతో, వైరస్ వారిని చుట్టు ముట్టేసింది. దీంతో మొదటగా కొందరికి జలుబు, దగ్గు, జ్వరం లాంటి లక్షణాలు బయటపడగా కరోనా పరీక్షలు చేయించుకోవడంతో పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.
నాలుగు రోజుల క్రితం 20 మందికి కరోనా పాజిటివ్ తేలగా ప్రస్తుతం ఈ సంఖ్య వందకు చేరిందని తెలిసింది. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న వారు కొంత మంది మెరుగైన వైద్యం కోసం పట్టణ ప్రాంతాలకు సైతం తరలివెళ్లారు. అయితే పాజిటివ్ వచ్చిన వారంతా వీధి నాటకం వీక్షించిన వారే కావడంతో మిగితా వారు కూడా క్రమక్రమంగా పరీక్షలు చేయించుకుంటున్నారు.
అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న పల్లె.. కరోనా కల్లోలంతో ఊరు ఊరంతా ఉలిక్కిపడింది. మొత్తం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయింది. బాధితుల్లో పలువురు వృద్ధులు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఎప్పుడూ సందడిగా ఉండే సుందరశాలలో ఇప్పుడు నిర్మానుష్య వాతావరణం కనిపిస్తోంది. అంతా అయిపోయాక జాగ్రత్తలు పాటిస్తున్నామంటున్నారు గ్రామస్తులు.