మంచిర్యాల: రసూల్ పల్లి వాగును పరిశీలించిన బాల్కసుమన్
మంచిర్యాల (CLiC2NEWS): గతవారం రోజులనుంచి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలతో రాష్ట్రంలోని జలాశాయాలు నిండుకుండల్లా మారాయి. భారీ వర్షాలకు పలు గ్రామాలు నీట మునిగాయి. ఎగువన కురిసిన వర్షాలతో పాటు అతి భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. గోదావరి నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో మంచిర్యాల జిల్లాలోని వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. జిల్లాలో జనజీవన స్తంభించి పోయింది. జైపూర్ మండలం టేకుమట్ల-శెట్టిపల్లి గ్రామాల మధ్యలోని రసూల్ పల్లి వాగు భారీ వరద ప్రవాహంతో పారుతోంది. దీంతో అక్కడ రాకపోకలకు పూర్తిగా అంతరాయం ఏర్పడింది. బుధవారం ఈ వాగును చెన్నూరు ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పరీశీలించారు. జిల్లా లోని వరద ముంపు ప్రాతాల పరిస్థితిపై ఎమ్మెల్యే ఆరా తీశారు. అలాగే ఇప్పటికే రసూల్‌పల్లి వాగుపై రూ. 8కోట్లతో వంతెన నిర్మించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని బాల్కసుమన్ ఈ సందర్భంగా తెలిపారు. వచ్చే వానాకాలంలోగా వాగుపై బ్రిడ్జి నిర్మిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.