Mancherial: పెద్ద చెరువు కాలువ కోసం ప్రజావాణిలో రైతుల విన్నపం
బీమారం (CLiC2NEWS): మంచిర్యాల జిల్లా బీమారం మండలం ఆరెపల్లికి చెందిన పలువురు రైతులు సాగునీటి కాలువ కోసం ప్రజావాణిలో అధికారులకు వినతి పత్రం అందజేశారు. సోమవారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆరెపల్లికి చెందిన 19 మంది రైతులు కాలువ ఏర్పాటు చేయాలని వినతి పత్రంలో కోరారు. భీమారం మండలం అరేపెల్లి గ్రామ శివారు ఎర్ర చెరువు రెండవ కాలువ మద్ధికల్ రోడ్డులో కొంత మేరకు వచ్చి ఆగిందని, ఆ కాలువకు దశాదిశా లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కాలువను వారి పొలాల వరకు విస్తరిస్తే సాగు నీరు అందుబాటులోకి వచ్చి పొలాలు సాగు చేసుకోడానికి వీలవుతుందని వారు వినతి పత్రంలో కోరారు. ఈ విషయమై అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలో రైతులు కోరారు.