Mandapet: దేశభక్తిని ప్రపంచానికి చాటి చెప్పాలి..
మండపేట (CLiC2NEWS): స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో భాగంగా ప్రతి ఇంటి మీద జాతీయ జెండాను ఎగురేసి దేశభక్తిని ప్రపంచానికి చాటి చెప్పాలని మండపేట శాసన సభ్యులు వేగుళ్ళ జోగేశ్వరరావు పేర్కొన్నారు. ఆజాదికా అమృత్ మహోత్సవ్ పేరుతో నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా అభియాన్ లో భాగంగా ఆగస్టు 13 నుంచి 15 వరకు ప్రతి ఇంటి పై జాతీయ జెండా ఎగురవేయాలన్న ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఇంటి మీద జాతీయ జెండాను ఎగుర వేయడానికి తపాలా శాఖ ద్వారా జాతీయ జెండాలు అందుబాటులో ఉన్నాయన్నారు. తాను కూడా తపాలా శాఖ కార్యాలయానికి వెళ్లి జాతీయ జెండాను తీసుకోవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా మండపేట పోస్టుమాస్టర్ నల్లమిల్లి శ్రీనివాస్ రెడ్డి, పోస్టల్ అసిస్టెంట్ కొండపల్లి సూర్యనారాయణ చేతుల మీదుగా జాతీయ పతాకాన్ని తీసుకున్నారు. జాతీయ జెండాను గౌరవించాలన్నారు. అలాగే స్వాతంత్య్ర వేడుకలకు రెండు రోజుల ముందు నుంచే జాతీయ జెండా ఎగురబోతున్న కారణంగా వేడుకలు పూర్తైన అనంతరం సాయంత్రం విధిగా జాతీయ జెండాను అవనతం చేయాలని విజ్ఞప్తి చేశారు వేడుకలు పూర్తయ్యాక జెండాను ఇంటి మీద అలాగే ఉంచితే మన జాతీయ జెండాను మనమే అవమాన పరిచినట్టు అవుతుందన్నారు. అందుచేత జెండా అవనతం చేయడం కూడా బాధ్యతగా తీసుకుని జెండాను జాగ్రత్తగా భద్రపరచాలని కోరారు.