Mandapeta: రిలే నిరాహార‌దీక్ష‌ల‌కు భారీగా విద్యార్థుల మ‌ద్దతు

మండపేట (CLiC2NEWS): మండ‌పేట నియోజ‌క వ‌ర్గాన్ని రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలోనే క‌లపాలంటూ కొన‌సాగుతున్న రిలే నిరాహార‌దీక్ష‌లు మూడో రోజుకుచేరుకున్నాయి. కోనసీమ జిల్లాలో తమ ప్రాంతాన్ని ఎట్టి పరిస్థితుల్లో కలిపేది లేదంటూ చేస్తున్న ఉద్యమం ఊపందుకుంది. అన్ని వర్గాల ప్రజలు కలిసి రావడంతో రోజు రోజుకి మద్దతు పెరుగుతోంది. రాజమహేంద్రవరం అయితేనే ప్రజలకు, విద్యార్థినీ విద్యార్థులకు కూడా శ్రేయస్కరంగా ఉంటుందని వివిధ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వానికి తెలియ జేస్తున్నారు. సీఐటీయూ కే కృష్ణవేణి ఆధ్వర్యంలో గురువారం ఆశ కార్యకర్తలు నిరాహార దీక్షల్లో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే గురువారం ప్రైవేట్ పాఠశాలలు అన్నీ ఏకతాటి మీదకు వచ్చాయి. పట్టణంలో ఉన్న విద్యావికాస్, ఎంపీఎస్ విద్యా సంస్థలు, అన్నపూర్ణ, సెయింట్ ఆన్స్, శ్రీ చైతన్య విద్యాసంస్థలు, విజ్ఞాన్ , ఆదిత్య కళాశాల విద్యార్ధులు భారీ సంఖ్యలో విచ్చేసి దీక్షల్లో పాల్గొన్న వారికి తమ మద్దతు తెలియజేశారు.

తొలుత విద్యార్థినీ విద్యార్థులు అంతా రాజారత్న జంక్షన్ నుండి మాహార్యాలీని ప్రారంభించారు. ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, ఏఐసీసీ సభ్యులు కామన ప్రభాకరరావు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కోన సత్యనారాయణ, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాధాకృష్ణ, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆలమూరు తాలూకా అధ్యక్షుడు వేగుళ్ళ పట్టాభిరామయ్య చౌదరి, మున్సిపల్ మాజీ చైర్మన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్,, జనసేన పార్టీ యూత్ నాయకుడు వేగుళ్ళ వీరజ్ తెలుగుదేశం పార్టీ టౌన్ అధ్యక్షుడు ఉంగరాల రాంబాబు, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు దూలి జయరాజుల నేతృత్వంలో భారీ ర్యాలీ జరిగింది.

చైతన్య రథం ఎక్కి పలు పాఠశాలల విద్యార్ధులు రాజమహేంద్రవరం లో మండపేట నియోజక వర్గం కలిస్తే లభించే ప్రయోజనాలను చాటి చెప్పారు. విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యవసాయం ఇలా అన్ని అంశాల మీద విద్యార్దులు ప్రసంగించిన తీరు చూపరులను ఆకర్షించింది. తమ ఆవేదనను ప్రభుత్వం పెద్ద మనసుతో తెలుసుకొని మండపేట నియోజక వర్గాన్ని రాజమహేంద్రవరం జిల్లాలో విలీనం చేయాలని కోరి ప్రార్థించారు. అనంతరం ర్యాలీ కేపీ రోడ్డు మీదుగా తహశీల్దారు కార్యాలయానికి చేరింది.

తహశీల్దారు తంగెళ్ళ రాజ రాజేశ్వరరావుకు ఎమ్మెల్యే వేగుళ్ల , జేఏసీ నాయకులు కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ప్రభుత్వం దృష్టికి ఇక్కడి ప్రజల ఆవేదనను తీసుకెళ్లాలని తహసీల్దారును వారు కోరారు. తహసీల్దారు కార్యాలయం బయట ఎంపీఎస్ విద్యార్దులు వినూత్న కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థినీ విద్యార్థులు నృత్య ప్రదర్శన ద్వారా భావాలను వ్యక్త పరిచారు. అమలాపురం వద్దు రాజమహేంద్రవరమే ముద్దు అంటూ గొంతెత్తి చెప్పారు. ర్యాలీలో ప్లకార్డులు చేత బూని రహదారి పొడవునా విద్యార్థులు నినాదాలు చేశారు. అన్ని ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు హాజరు కావడంతో మండపేట పట్టణం జన సంద్రంగా మారింది. ప్రధాన రోడ్లన్నీ కిక్కిరిసాయి. రాజమహేంద్రవరం కావాలంటూ చేసిన విద్యార్థి గర్జనకు పట్టణం ఒకసారిగా ఉలిక్కి పడ్డట్టు అయింది.

ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పిల్లి గణేశ్వరరావు, ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ కార్యదర్శి గుండు తాతరాజు, జై భీమ్ యూత్ అధ్యక్షుడు చాపల వీరబాబు, జనసైనికులు మామిడాల మనో, బొమ్మన సతీష్ కుమార్, అలాగే ఉండ్రాసపు అర్జున్, వీరమల్లు శ్రీనివాస్, కొడమంచిలి భాస్కరరావు, లైన్స్ క్లబ్ అధ్యక్షులు వాదా ప్రసాదరావు, జొన్నపల్లి సూర్యారావు, వెంటపల్లి జాన్ మార్క్, పలివెల సుధాకర్, జర్నలిస్టు యూనియన్ నాయకులు సయ్యద్ హుస్సేన్, వేమగిరి నూకరాజు, గాలింకి నాగేశ్వరరావు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.