జ‌ల‌మండ‌లి అధికారుల‌తో మంత్రి కేటీఆర్ స‌మీక్ష‌

ఎస్‌టిపిల నిర్మాణం వేగవంతం చేయాలి

 

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): కొత్త ఎస్‌టిపిల నిర్మాణాన్ని వేగ‌వంతం చేయాల‌ని రాష్ట్ర పురపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి క‌ల్వ‌కుంట్ల తారకరామారావు పేర్కొన్నారు. ఇప్ప‌టికే మురుగునీటి శుద్ధిలో హైద‌రాబాద్ ముందంజలో ఉందని, కొత్త ఎస్‌టిపిల నిర్మాణం కూడా పూర్తైతే పూర్తిస్థాయిలో మురుగునీటి శుద్ధి జరుగుతుందని అన్నారు. సోమ‌వారం(27.12.2021) ఆయ‌న నానక్ రామ్ గూడలోని హెచ్ జిసిఎల్ కార్యాలయంలో జ‌ల‌మండ‌లి ఎండీ దాన‌కిశోర్‌, ఇత‌ర ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. జ‌ల‌మండ‌లి చేప‌డుతున్న ప‌నులపై ఆయ‌న స‌మీక్ష జ‌రిపారు.
ఎస్‌టిపిల వ‌ద్ద ఉద్యాన‌వనాలు తీర్చిదిద్దాలి:

ఎస్‌టిపిలను ప‌చ్చ‌టి ఉద్యాన‌వ‌నాలుగా చ‌క్క‌టి ఆహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణంతో మార్చాల‌ని కేటీఆర్ సూచించారు. ఎస్‌టిపిలు న‌గ‌ర‌వాసుల‌కు విహార కేంద్రాలుగా తీర్చిదిద్దాల‌ని జ‌ల‌మండ‌లి అధికారుల‌కు ఆయ‌న సూచ‌న‌లు చేశారు. న‌గ‌రం వేగంగా విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో శివార్ల‌పైన కూడా దృష్టి పెట్టాల‌న్నారు. ఓఆర్ఆర్ అవ‌త‌ల కూడా జన సాంద్రత ఎక్కువుగా ఉన్న ప్రాంతాలను గుర్తించి మరిన్ని నూత‌న ఎస్‌టిపిల నిర్మాణానికి అంచ‌నాలు రూపొందించాల‌ని సూచించారు.

ఏడాదిలో ఓఆర్ఆర్ – 2 పూర్తి చేయాలి:

ఓఆర్ఆర్ – 2లో భాగంగా చేప‌డుతున్న ప‌నుల‌ను ఏడాదిలో పూర్త‌య్యేలా చూడాల‌న్నారు. విస్తరించిన ఓ ఆర్ఆర్ గ్రామాల ప్రాంతాలకు నీటి సరఫరా మరియు మౌలిక సదుపాయాలను అందించడం కోసం రూ .1200 కోట్లతో వ్యయంతో ORR గ్రామాల ప్రాజెక్ట్ ఫేస్- II ను జలమండలి చేపట్టింది. ఈ కార్య‌క్ర‌మంలో ఈడీ ఎం. సత్యనారాయణ ఇతర డైరెక్ట‌ర్లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.