ఎమ్మెల్యే వేగుళ్ల అరెస్టు..
మండపేట (CLiC2NEWS): ద్వారపూడి – మండపేట రోడ్డును అభవృద్ధి చేయాలంటూ నిరసనకు పిలిపును ఇచ్చిన మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావును, పార్టీ నాయకులను పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ద్వారపూడి మండపేట రోడ్డు పాడై పోతే గత మూడేళ్లుగా దాన్ని పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నారంటూ, దీనిపై తాను అన్ని రాజకీయ పక్షాలతో అదే రోడ్డులో రాస్తారోకో చేస్తానని ఎమ్మెల్యే వేగుళ్ళ మీడియా ద్వారా ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం టీడీపీ శ్రేణులు నిరసన కార్యక్రమానికి సమాయత్తమయ్యారు. ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు వేగుళ్ల అభిమానులు పెద్ద ఎత్తున రథం సెంటర్ వద్ద గల టీడీపీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ముందస్తు సమాచారంతో ఉన్న పోలీసులు టీడీపీ కార్యాలయం వద్ద భారీగా మోహరించారు.
రామచంద్రపురం డీఎస్పీ బాల చంద్రారెడ్డి నేతృత్వంలో పోలీసు సిబ్బంది టీడీపీ కార్యాలయానికి వచ్చి రాస్తారోకో చేయడానికి పరిమిషన్ లేదని చెప్పారు. పోలీసులు ఎమ్మెల్యే వేగుళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే వేగుళ్ళ వాహనంపై ఉండి ప్రభుత్వ నిరంకుశత్వం నశించాలంటూ పెద్ద ఎత్తున నినదించారు. ఒక దశలో పార్టీ నాయకులకు పోలీసులకు తోపులాట జరిగింది. చివరకు సిఐ శివ గణేష్, ఆలమూరు ఎస్సై శివకృష్ణ, వారిని అరెస్టు చేసి పోలీసు వాహనంలో తరలించారు. అనంతరం పోలీసు స్టేషన్ వద్ద పార్టీ నాయకులు నిరసన తెలిపారు.