జలమండలిని సందర్శించిన 4 రాష్ట్రాల అధికారులు

సెప్టిక్ వ్యర్థాల నిర్వహణను పరిశీలించిన బృందం
ఎఫ్ఎస్‌టీపీల పరిశీలన
యూనిసెఫ్, ఆస్కి ఆధ్వర్యంలో శిక్షణ, అధ్యయనం
హైదరాబాద్ (CLiC2NEWS): పూర్తిస్థాయిలో సెప్టిక్ ట్యాంకుల వ్యర్థాల ట్రీట్‌మెంట్ ద్వారానే జలవనరులు కలుషితం కాకుండా కాపాడుకోవచ్చని, ఈ దిశగా జలమండలి పని చేస్తోందని ఎండీ దానకిశోర్ పేర్కొన్నారు. జలమండలి ఆధ్వర్యంలో ఓఆర్ఆర్ ప్రాంతాల్లోని సెప్టిక్ ట్యాంకర్ల వ్యర్థాల నిర్వహణ కోసం రూపొందించిన ఫీకల్ స్లడ్జ్ ఆండ్ సెప్టేజ్ మేనేజ్‌మెంట్ (ఎఫ్ఎస్ఎస్ఎం) వ్యవస్థను అధ్యయనం చేయడానికి అస్సాం, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన మున్సిపల్ అధికారుల బృందం గురువారం జలమండలిలో పర్యటించారు. అడ్మినేస్ట్రేటీవ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కి), యూనిసెఫ్ ఆధ్వర్యంలో ఈ బృందం నగరంలో సెప్టిక్ వ్యర్థాల నిర్వహణను పరిశీలించింది. ఉప్పల్‌లోని నల్లచెరువు ఎఫ్ఎస్‌టీపీని పరిశీలించి వాటి పనితీరును తెలుసుకున్నారు. బోడుప్పల్‌లో జియోబ్యాగ్ టెక్నాలజీ ద్వారా నడుస్తున్న ఎఫ్ఎస్‌టీపీని కూడా పరిశీలించారు.
భవిష్యత్ అవసరాలకు తగ్గట్లుగా ఎఫ్ఎస్‌టీపీలు
అనంతరం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయానికి ఈ బృందం విచ్చేసింది. జలమండలి ఆధ్వర్యంలో నగరంలో సెప్టిక్ ట్యాంకుల వ్యర్థాల నిర్వహణ జరుగుతున్న తీరును ఎండీ దానకిశోర్ వివరించారు. జలవనరులు కలుషితం కాకుండా, ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకు సెప్టిక్ ట్యాంకుల వ్యర్థాల ట్రీట్‌మెంట్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఓఆర్ఆర్ పరిధిలోని గ్రామాల్లో దాదాపు 12 లక్షల ఇళ్లు, భవనాల సెప్టిక్ వ్యర్ధాల సేకరణ, శుద్దీకరణకు జలమండలి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుందని పేర్కొన్నారు.
అలాగే ఈ ప్రాంతాల్లోని సెప్టిక్ ట్యాంకర్ల నిర్వాహకులకు విధిగా లైసెన్స్ జలమండలి నుంచి పొందేలా కట్టుదిట్టమైన ఏర్పాటు చేసిందని వివరించారు. సేకరించిన సెప్టిక్ ట్యాంక్ వ్యర్ధాలను బహిరంగ ప్రదేశాల్లో, చెరువులు, వాగులు, అటవీ ప్రాంతాల్లో పారబోసి నీటిని, భూమిని కలుషితం చేయకుండా జలమండలి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందన్నారు.
అంతేకాకుండా, రానున్న 20 ఏళ్ల అవసరాలకు తగ్గట్లుగా కొత్త ఎఫ్ఎస్‌టీపీల నిర్మాణం జరుపుతున్నామన్నారు. డయల్ – ఏ – సెప్టిక్ ట్యాంక్ క్లీనర్ కార్యక్రమాన్ని మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు చేతుల మీదుగా జలమండలి ప్రారంభించిందని, దీని ద్వారా ప్రజలకు, సెప్టెక్ ట్యాంకర్ల వాహన ఓనర్లకు, క్లీనర్‌లకు మేలు జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ నుంచి ఐఏఎస్ అధికారులు గౌరవ్, బెనల్, సందీప్‌తో పాటు అస్సాం, ఝర్ఖండ్, చత్తీస్‌గఢ్ నుంచి నగర పాలక సంస్థల ఉన్నతాధికారులతో పాటు యూనిసెఫ్ ప్రతినిధులు, జలమండలి ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్ బాబు, సీజీఎం ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.