పదవీ విరమణ వయస్సులో ప్రధానోపాధ్యాయుడి కీచక పర్వం..
ఒంగోలు (CLiC2NEWS): తల్లిదండ్రుల తర్వాత అంతటి విలువ కలిగిన గురువు.. చిన్నారులను ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన ప్రధానోపాధ్యాయుడు బాలికపై అత్యాచారానికి యత్నించాడు. ఈ ఘటన ఎపిలోని ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం పెద కొత్తపల్లి అంజయ్యనగర్ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం చోటుచేసుకుంది. పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న సుందరబాబు.. ఓ బాలికపై అత్యాచారానికి యత్నించాడు. భయపడిన బాలిక పరుగులు తీసి నేరుగా తల్లిదండ్రులకు విషయం తెలిపింది. తల్లిదండ్రులు, స్థానికులు పాఠశాలలో ఉన్న సుందరబాబుకు దేహశుద్ధి చేశారు. ఇదివరకు కూడా మరో ఇద్దరు బాలికలతోనూ ఇలానే ప్రవర్తించినట్లు విద్యార్థులు తెలపుతున్నారు. ఈ ప్రధానోపాధ్యాయుడు మరికొన్ని రోజుల్లో పదవీ విరమణ చేయాల్సి ఉందని తెలుస్తోంది. పోలీసులు అతనిని స్టేషన్కు తరలించారు. డిఇఒ సుందరబాబును విధుల నుండి సస్పెండ్ చేసినట్లు సమాచారం.