జ‌ల‌మండ‌లికి పీఆర్ఎస్ఐ అవార్డులు

హైద‌రాబాద్ (CLiC2NEWS): ప‌బ్లిక్ రిలేష‌న్స్ రంగంలో జ‌ల‌మండ‌లి రెండు పీఆర్ఎస్ఐ అవార్డులను గెలుచుకుంది. ప‌బ్లిక్ రిలేష‌న్స్ ఆఫ్ ఇండియా(పీఆర్ఎస్ఐ) హైద‌రాబాద్ చాప్ట‌ర్ 50 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకున్నందున గోల్డెన్ జూబ్లీ వేడుక‌లతో పాటు 3వ తెలంగాణ స్టేట్ ప‌బ్లిక్ రిలేష‌న్స్ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా పీఆర్ రంగంలో వివిధ సంస్థ‌ల ప‌నితీరు ఆధారంగా అవార్డుల‌కు ఎంపిక చేశారు. ఇందులో జ‌ల‌మండ‌లికి రెండు అవార్డులు ద‌క్కాయి. ఈ అవార్డుల‌ కోసం జాతీయ, రాష్ట్ర‌ స్థాయి సంస్థ‌లు సింగ‌రేణి కాల‌రీస్‌, ఎన్ఎండీసీ, టీఎస్ఐఐసీ, టీశాట్‌, రాంకీ, అగ్రిక‌ల్చ‌ర్ యూనివ‌ర్సిటీ త‌దిత‌ర ప్ర‌సిద్ధ సంస్థ‌లు పోటీప‌డ్డాయి

‘వాట‌ర్ ఫ‌ర్ ఆల్‌.. ఎక్సెలెన్స్ థ్రూ ఇన్నొవేష‌న్’ పేరుతో జ‌ల‌మండ‌లి రూపొందించిన కాఫీ టేబుల్ బుక్‌కు మొదటి స్థానం ద‌క్కింది. జ‌ల‌మండ‌లికి సంబంధించిన వివ‌రాలు, చేప‌డుతున్న‌ అభివృద్ధి కార్య‌క్ర‌మాల స‌మాహారంగా ఈ బుక్‌ను రూపొందించింది. బెస్ట్ యూజ్ ఆఫ్ గ్రాఫిక్స్ ఆండ్ ఎఫెక్ట్స్ అనే కేట‌గిరిలో జ‌ల‌మండ‌లి రూపొందించిన ‘జ‌ల‌గీతం’ వీడియో సాంగ్ సైతం మొద‌టి స్థానాన్ని ద‌క్కించుకుంది. జ‌ల‌మండ‌లి ఎన్నో వ్య‌య‌ప్ర‌యాస‌ల‌తో కృష్ణా, గోదావ‌రి న‌దుల నుంచి న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు స‌ర‌ఫ‌రా చేస్తున్న నీటి విలువ‌ను క‌ళ్ల‌కు క‌ట్టేలా వివ‌రించ‌డంతో పాటు విలువైన నీటిని వృథా చేయ‌కుండా అవ‌గాహ‌న క‌ల్పించ‌డానికి నాలుగు నిమిషాల నిడివి క‌లిగిన వీడియో సాంగ్‌ను రూపొందించింది. జ‌ల‌మండ‌లి ప్ర‌ధాన కార్యాల‌యంలో ఎండీ దాన‌కిశోర్‌కు జ‌ల‌మండ‌లి పీఆర్వో సుభాష్, ఓఎస్డీ పీఆర్వో మ‌నోహ‌రా చారి ఈ అవార్డుల‌ను అందించారు.

జ‌ల‌మండ‌లి పీఆర్ సెల్‌కి రెండు అవార్డులు ద‌క్క‌డం ప‌ట్ల ఎండీ దాన‌కిశోర్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఇందుకోసం కృషి చేసిన పీఆర్ బృందాన్ని ఆయ‌న అభినందించారు. అంత‌కుముందు ది ప్లాజా హోట‌ల్‌లో నిర్వ‌హించిన పీఆర్ఎస్ఐ గోల్డెన్ జూబ్లీ వేడుక‌లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా సుభాష్‌, మ‌నోహ‌రాచారి ఈ అవార్డుల‌ను అందుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.