ఆపరేషన్ స్మైల్ – XI ను విజయవంతం చేద్దాం: రామగుండం సి పి
బాల కార్మిక వ్యవస్థ ను రూపు మాపుదాం
రామగుండం పోలీస్ కమిషనరేట్ (CLiC2NEWS): ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడ జనవరి 1 నుండి 31 వరకు నిర్వహిస్తున్న ఆపరేషన్ స్మైల్ -XI ను ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పని చేసి విజయవంతం చేయాలని రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ అధికారులను కోరారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ లో పోలీస్ కమీషనర్ గారి అధ్యక్షత కమీషనరేట్ పరిధిలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో ఈ రోజు సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్బంగా సిపి మాట్లాడుతూ…. ఆపరేషన్ స్మైల్ -XI లో పాలుపంచుకొంటున్న ప్రతి ఒక అధికారి ముగ్గురు పిల్లలను రెస్క్యూ చేయాలనీ కోరారు. ప్రతీ ఒక్కరి జీవితంలో బాల్యం అమూల్యమైనదని, దానిని అనుభవించటం ప్రతీ పౌరుని హక్కు అని అన్నారు. కానీ క్షణికావేషంలో పిల్లలు తొందరపాటులో చిన్న చిన్న విషయాలకే తల్లి దండ్రులను విడిచి ఇంటికి దూరంగా ఉంటున్నారని, ఇట్టి అవకాశాన్ని ఆసరాగా తీసుకొని కొందరు వారిని ప్రమాదకర పనుల్లో వారితో పనులు చేయిస్తూ వారి జీవితాలతో ఆడుకుంటున్నారని అలాంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
తప్పి పోయిన పిల్లలను వెతికి ‘దర్పణ్ ‘ అప్లికేషన్ ద్వారా వారిని గుర్తించి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరు పరచి ,తిరిగి తల్లి దండ్రుల వద్దకు చేర్చి వారి శోకాన్ని తీర్చాలని అన్నారు. బిక్షాటన చేస్తున్న వారి గురించి, బాలకార్మికుల గురించి ఎప్పటి కప్పుడు సమాచారం ఇవ్వడానికి చైల్డ్ హెల్ప్ లైన్ కు చెందిన 1098,112 నెంబర్ల గురించి ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని చెప్పారు. ప్రతీ పోలీస్ డివిజన్ స్థాయిలో ఒక సబ్-ఇన్స్పెక్టర్ తో పాటుగా ఒక మహిళా పోలీస్ అధికారి, నలుగురు సిబ్బంది, వివిధ డిపార్ట్మెంట్ అధికారులతో నెల రోజుల పాటు ఇదే పనిపై ఇటుక బట్టి లు, వివిధ రకాల పరిశ్రమలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, ట్రాఫిక్ జంక్షన్లు, క్షుణ్ణంగా పరిశీలించి కుటుంబాలకు దూరంగా ఉంటున్న పిల్లలను గుర్తించాలని అన్నారు.
ఈ సమావేశం లో అడిషనల్ డిసిపి అడ్మిన్ సి. రాజు ఎ.సి.పి. మల్లారెడ్డి, ఇన్స్పెక్టర్- రమేష్ బాబు, ఎస్.ఐ- రాజేష్, శైలజ, లచ్చన్న, శరణ్య, సి.డబ్లు.సి ఛైర్మెన్-శ్రీధర్, డీ.ఏం & హెచ్.ఓ- అన్నప్రసన్న కుమారి, లేబర్ ఆఫీసర్- హేమలత & సత్యనారాయణ, డి.సి.పి.ఓ- కమలాకర్ & ఆనంద్, పి.ఓ- జితేందర్, డి.ఇ.ఓ సెక్టర్ ఆఫీసర్ – సత్యనారాయణమూర్తి & అజీముద్దీన్ దబీర్, సంజీవయ్య, లీగల్ ప్రొబేషనరీ ఆఫీసర్- రజీత, చైల్డ్ లైన్- ఉమాదేవి, రమాదేవి & ప్రవీణ్ కుమార్, సి.డబ్లు.సి మెంబర్-శ్యామ్ సుందర్, సుమలత మరియు సబ్ డివిజనల్ ఇన్చార్జి మరియు టీమ్ సభ్యులు పాల్గొన్నారు.