బహిరంగ ప్రదేశాల్లో మద్యంపై నిషేధాజ్ఞలు కొనసాగింపు: రామగుండం సిపి
అనుమతి లేని డ్రోన్, డిజె సౌండ్స్ పై చర్యలు
రామగుండం పోలీస్ కమిషనరేట్ (CLiC2NEWS): ప్రజల భద్రత రక్షణ కోసం మద్యం పై నిషేధాజ్ఞలు కొనసాగింపు నిర్ణయం తీసుకున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. సాధారణ పౌరులు ప్రధానంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రామగుండం కమిషనరేట్ పరిధిలో మంచిర్యాల, పెద్దపల్లి జోన్ లలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం పై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను పొడిగిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి మద్యం ప్రియులు పాల్పడుతున్న ఆగడాలపై పలు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అదేవిధంగా డిజె, డ్రోన్‌ల వినియోగంపై కూడా నిషేదాజ్ఞలు పొడిగిస్తున్నట్లు వెల్లడించారు. వివిధ కార్యక్రమాల నిర్వహణకు మైక్ సెట్ వినియోగం తప్పనిసరి అని అనిపిస్తే సంబంధిత డివిజన్ ఎసిపి ల అనుమతి పొందాలని సూచించారు.
ఈ నిషేధాజ్ఞలు 01-01-2025 నుండి 01-02-2025 వరకు కొనసాగుతాయని తెలిపారు. పరిస్థితుల ప్రభావం దృష్ట్యా ఈ కాలం పరిమితి పొడిగించబడే అవకాశం ఉందని అన్నారు. (భారతియ న్యాయ సంహిత) BNS 223, హైదరాబాద్ నగర పోలీసు చట్టం, 1348 ఫసలీ నిబంధనలను అనుసరించి నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు.