ఎస్.వి.రమణా చారి: మళ్లీ యుద్ధమా..

మళ్లీ యుద్ధమా….

కాలం కలిసి వచ్చింది

అనుకున్నది సాధించాం

యుద్ధ గొంతుకలు విశ్రమించాయి

ప్రజాస్వామ్య సౌధం సాక్షిగా

అమరవీరుల బలిదానం గుర్తుగా

రాష్ట్ర సాధన సాకారమైనది

రక్తరహిత విప్లవం విజయకేతనం ఎగరేసింది

కోటి రతనాల వీణ

తన ఆత్మనినాదాన్ని నిలుపుకుంది

భారతమ్మ సాక్షిగా కొత్త రాష్ట్రంగా అవతరించింది

తడబడుతూ అడుగులో అడుగులు వేస్తూ

అభివృద్ధి బాటలు వేస్తూ

స్వయం సమృద్ధి సాధిస్తూ

అందరినీ ఆకర్షిస్తున్నది

ఓ వైపు జల వనరులు లేకుండా ఎడారిగా మారిన మాగాణాలు

పచ్చటి తివాచీలు పర్చుకుంటున్నాయి

గుక్కెడు నీటికి తపించిన గొంతులు

దాహార్తిని తీర్చుకున్నాయి.

గంగమ్మతల్లి కరుణించి

గుమ్ముల నిండా ధాన్య రాసులు నింపుతుంది.

ప్రతిజీవి తన ఆత్మగౌరం చాటాలని తపన పడుతోంది.

కుమ్మరి,కమ్మరి,చాకలి,మంగలి సబ్బండవర్ణాలు

సమరం చేసి సాధించిన రాష్ట్రం లో

ప్రగతిశీల జీవనం కోసం పరితపిస్తున్న వేళ

ఎవ్వరో వినిపించిరి జరిగింది యుద్ధంకాదని

అవతరించింది రాష్ట్రం కాదని

అది అంతా భ్రమయని

మీరు చూస్తున్నది భ్రాంతియని

గుండెలపై బండలు విసిరిరి

సేదతీరుతున్న యుద్ధగొంతుకలు

మరఫిరంగులుగా మారుతున్నవి

మళ్లీ పిడికిళ్ళు బిగుసుకుంటున్నవి

యుద్ధం వద్దంటూ హెచ్చరికలు చేస్తున్నవి

ఒకడిది రాజ తంత్రమట

మరొకరిది రణ తంత్రమట

ఎత్తుకుపై ఎత్తులు

ఎవరికోసం ఈ జిత్తులు

ప్రజాస్వామ్య భారతమా

కాపాడుకో నీ భావిభారత రత్నాన్ని

శాంతి వచనం కవచంగా మారనీ

బంగారురతనాల మాగాణాన్ని బతకనీయి.

ఆగం చేస్తే అగ్గిపుడుతది

ఆలోచిస్తే ఆహ్వానిస్తది.

చేయి అందిస్తే మెడలో దండలు వేస్తరు.

చేయి లేపితే చెడుగుడు తప్పదు.

రణం వద్దు రణం వద్దు.

జాతీయతలో భాగమేనని మరవద్దు..

వేర్పాటుతో వేరు చేయొద్దు..

భరతమాత ఒడిలోసేద తీర్చు..

జాతిఖ్యాతికి మేలు నగగా మార్చు

-ఎస్.వి.రమణా చారి
సీనియ‌ర్ పాత్రికేయులు

సెల్‌: 98498 87086

(తెలంగాణ ఏర్పాటు అసంబద్ధంగా జరిగిందంటూ వస్తున్న వ్యాఖ్యలకు నిరసంగా)

1 Comment
  1. ఫణీంద్ర says

    అద్భుతః.. రాజ్యమా! నీవు కాకూడదు ఏ కొందరికో బోజ్యం ! అందాలి ఫలాలు అందరికీ! పల్లెల్లో నీళ్ళ గలగలలు.. నా కళ్ళల్లో ప్రకృతి అందాలు మళ్ళీ మెరవాలి.. అన్నారు పెద్దలు.. కష్టే ఫలి… ప్రస్తుతము ఎవ్వరూ కష్టాన్ని ఓర్చలేక .. సుఖా న్ని కోరి…పొందుతున్నారు.. అనారోగ్యాన్ని కోరి కోరి…. ఎటు మన ప్రయాణం…. చేపలు ఇవ్వడం కాదు చేయాల్సింది…. నేర్పాలి చేపలు పట్టడం… అప్పుడే అందుతాయి ఫలాలు అందరికీ… గురువు లేని విద్య గుడ్డి విద్య… కాదా ప్రస్తుతం.. మన విద్యా రంగ పరిస్థితి… ఢిల్లీ లో పట్టింది ఐదేళ్లు విద్యా రంగంలో అద్భుతాలకు.. మనకు సరి పోలేదు ఏడేళ్లు… ఇప్పటి కైనా మించి పోయింది లేదు… రాజు తలుచు కుంటే…… మార్పులకు కొదువా…!

Leave A Reply

Your email address will not be published.