రాష్ట్రంలో అర్హులకు రేషన్, ఆరోగ్య కార్డులు.. సిఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్ (CLiC2NEWS): వచ్చే నెలలో ప్రత్యేకంగా ప్రజాపాలన నిర్వహించాలని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి , వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహతో కలసి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సెప్టెంబర్ 17 నుండి రాష్ట్రంలో పదిరోజుల పాటు జరిగే ప్రజాపాలన కార్యక్రమంలో అర్హులైన వారికి రేషన్, ఆరోగ్య కార్డులు అందించేందుకు అవసరమైన సమాచారం సేకరించనున్నట్లు సమాచారం.
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు చేపట్టే చర్యల పట్ల ఉదాసీనంగా వ్యవహరించే వారిని ఊపేక్షించేదిలేదని సిఎం అన్నారు. రాష్ట్రంలో డెంగీ, గన్యాతో పాటు వైరల్ జ్వరాలతో ఆస్పత్రులలో కేసులు పెరుగుతున్నాయని సిఎం ఆందోళన వ్యక్తం చేశారు. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో దోమల నిర్మూలనకు ఫాగింగ్, స్ప్రే వంటి చర్యలను ముమ్మరం చేయాలన్నారు. జిహెచ్ ఎంసి అధికారులు, జిహెచ్ ఎంసి పరిధిలోని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ సమన్వయంతో సాగాలని ఉన్నతాధికారుల సమీక్షలో పేర్కొన్నారు. అవసరమైతే సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీసు విభాగం, సచ్చంద సేవా సంస్థలు, మీడియా సహకారం తీసుకోవాలన్నారు. అవసరమైతే ప్రత్యేక పారిశుధ్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను సిఎం ఆదేశించారు.