Remdesivir: అక్రమ దందా ముఠా సభ్యుల అరెస్టు
రామగుండం (CLiC2NEWS): రాష్ట్రంలో కరోనా సెకండ్ విజృంభిస్తున్న వేళ మహమ్మారి వ్యాప్తిని ఆసరా చేసుకుని కొందరు రెమ్‌డెసివర్ ఇంజక్షన్‌ను బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రమయిస్తున్నారు. తాజాగా ఇలా రెమ్‌డెసివర్ ఇంజక్షన్‌ను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్న ముఠాను సోమవారం రామగుండం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
జిల్లా కేంద్రంలోని హెల్త్‌కేర్, పల్స్ హాస్పిటళ్లకు చెందిన ఇద్దరు సిబ్బందితోపాటు మరో ఇద్దరు అంబులెన్స్ నిర్వాహకులు రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్లో రూ.25 వేల నుంచి రూ.30 వేలకు విక్రయిస్తున్నారు.
ఆయా ఆస్పత్రులలో అడ్మిట్ అయిన రోగుల వివరాలను సేకరించి వారికి రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు అందిస్తామని ముందుగా నమ్మిస్తున్నారు. రోగుల నుంచి సమాచారాన్ని తీసుకొని నకిలీ ప్రిస్కిప్షన్ తయారు చేసి హైదరాబాద్ నుంచి ఇంజక్షన్లను తెప్పిస్తున్నారు. రోగుల బంధువులు దీనికి అంగీకరించిన వెంటనే బెల్లంపల్లికి చెందిన పల్లె రమేష్ (పల్స్ హాస్పిటల్)లు అంబులెన్స్ నిర్వాహకులైన తిర్యాణికి చెందిన పులి సంతోష్, మంచిర్యాలకు చెందిన పున్నం రంజిత్‌కుమార్‌లు రోగుల బంధువుల వద్ద రూ.30 వేలు వసూళు చేస్తున్నారు. తర్వాత ఈ డబ్బులను నలుగురు పంచుకుంటారు.
రామగుండం సీపీ సత్యనారాయణ ఆదేశాల మేరకు సీఐ ముత్తి లింగయ్య, టాస్క్‌ఫోర్స్ సీఐ రాజ్‌కుమార్‌ల పర్యవేక్షణలో ప్రత్యేక టీం పట్టుకున్నారు. అనంతరం సంఘటనకు సంబంధించి ఆదివారం ఏసీపీ అఖిల్ మహాజన్ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పోలీసులు గొట్టి రాజేందర్, పల్లె రమేష్, పులి సంతోష్‌లను అరెస్టు చేయగా, పున్నం రంజిత్‌కుమార్ పరారీలో ఉన్నాడు. నిందితుల నుంచి 5 రెమ్‌డెసివిర్ ఇం జక్షన్లతోపాటు ఓ అంబులెన్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.