రూ. 2కోట్ల విలువైన మద్యం.. రోడ్డు రోలర్‌తో తొక్కిస్తూ..

విజయవాడ గ్రామీణం (CLiC2NEWS): ఎక్సైజ్ కేసుల్లో పట్టుబడిన సుమారు రూ.2 కోట్ల విలువైన మద్యం సీసాలను పోలీసులు ధ్వంసం చేశారు. గ్రామీణ మండలం నున్నలోని మామిడి మార్కెట్ యార్డు ఆవరణలో నగర పోలీసు కమిషనర్ కాంతిరాణా టాటా సమక్షంలో 62,461 మద్యం సీసాలను రోడ్డు రోలర్‌తో తొక్కించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎన్‌టిఆర్ జిల్లాలోని వన్‌టౌన్, నున్న, అజిత్‌సింగ్ నగర్, గవర్నర్ పేట, సూర్యారావు పేట, కృష్ణలంక, భవానీపురం, ఇబ్రహీంపట్నం, మాచవరం పోలీస్ స్టేషన్‌ల పరిధిలో గడిచిన రెండేళ్లో అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను పట్టుకున్నట్లు తెలిపారు. మొత్తం 877 ఎక్సైజ్ కేసుల్లో పట్టుబడిన ఈ సీసాలను ఎపి ఎక్సైజ్ యాక్ట్ కింద ధ్వంసం చేయడం జరిగిందన్నారు. ఎవరైనా అక్రమ మద్యం తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, నాన్ బెయిలబుల్ కేసులు పెడతామని స్పష్టం చేశారు.