రెవెన్యూ పెంపుపై జలమండలి ప్రత్యేక కార్యాచరణ

ఇక వాణిజ్య కనెక్షన్ల బిల్లు జారీ.. వసూలు అంతా ఆన్‌లైన్‌లోనే
సమగ్ర వివరాల నమోదు కోసం మొబైల్ యాప్
అధ్యయనం చేయడానికి ప్రత్యేక కమిటీ
జలమండలి ఎండీ దానకిశోర్
హైదరాబాద్ (CLiC2NEWS): వాణిజ్య(నాన్ డొమెస్టిక్) కనెక్షన్లకు సంబంధించిన నీటి బిల్లుల బకాయిల వసూలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జలమండలి ఎండీ దానకిశోర్ అధికారులకు సూచించారు. బుధవారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో సీజీఎంలు, జీఎంలతో ఆయన రెవెన్యూపై సమీక్షా సమావేశం నిర్వహించారు. బకాయిలు చెల్లించని నాన్ డొమెస్టిక్ వినియోగదారుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
ఈ అక్టోబరు చివరి నాటికి పైప్ సైజు 40ఎంఎం, అంతకంటే ఎక్కువ కనెక్షన్లు కలిగిన ప్రతీ వినియోగదారుడి నుంచి 100 శాతం బకాయిలు వసూలు చేయాలని, అలాగే మిగిలిన వాణిజ్య కనెక్షన్ వినియోగదారుల నుంచి 50 శాతం బకాయిలను అక్టోబరులో కచ్చితంగా వసూలు చేయాలని, మూడు నెలల్లో మొత్తం 100 శాతం బకాయిలు వసూలు చేయాలని ఆయన అధికారులకు లక్ష్యం నిర్దేశించారు. వాణిజ్య కనెక్షన్ తీసుకున్న నాటి నుంచి అసలు బిల్లులే చెల్లించని(నెవర్ పెయిడ్) వినియోగదారుల నల్లా కనెక్షన్‌ను వెంటనే తొలగించాలని ఆదేశించారు. రెవెన్యూ వసూలులో ఉదాసీనంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అధికారులను హెచ్చరించారు.
బిల్లుల జారీ, వసూలు ఆన్‌లైన్ విధానం అమలుపై అధ్యయనానికి కమిటీ
వాణిజ్య కనెక్షన్ వినియోగదారులకు సంబంధించిన నెలవారీ బిల్లుల జారీ, వసూలు మొత్తం ఆన్‌లైన్ ద్వారా జరిగేలా నూతన విధానం అమలుపై అధ్యయనం చేయడానికి ప్రత్యేక కమిటీని నియమిస్తున్నట్లు ఎండీ దానకిశోర్ పేర్కొన్నారు. మొదటగా నేరుగా బిల్లును జారీ చేయకుండా ఆన్‌లైన్(ఎస్ఎంఎస్, వాట్సాప్, ఈమెయిల్, వంటి) మాధ్యమాల ద్వారా జారీ చేసి, బిల్లు వసూలు కూడా డిజిటల్ పేమెంట్ అయ్యేలా చూసేందుకు ఈ కమిటీలో చర్చించి తగు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. సీజీఎం నేతృత్వంలోని ఈ కమిటీలో జీఎంలు, డీజీఎంలు, మేనేజర్‌లు సభ్యులుగా ఉంటారు. వీరు ఆయా డివిజన్లలో ఉన్న నాన్ – డొమెస్టిక్ వినియోగదారులతో చర్చించి, వారి అభిప్రాయాలను సేకరించాలని సూచించారు.
వాణిజ్య కనెక్షన్‌కు జియోట్యాగింగ్
వాణిజ్య కనెక్షన్ల వివరాలను పక్కాగా నమోదు చేయడానికి కొత్త మొబైల్ యాప్‌ను రూపొందించినట్లు ఆయన తెలిపారు. క్షేత్రస్థాయిలో పర్యటించి అన్ని నాన్ – డొమెస్టిక్ కనెక్షన్లకు సంబంధించిన సమగ్ర వివరాలను సర్వే చేసి ఈ యాప్‌లో నమోదు చేయాలని ఆయన సూచించారు. అలాగే, ప్రతీ నాన్ డొమెస్టిక్ కనెక్షన్‌ను జియోట్యాగింగ్ చేయాలని ఆయన పేర్కొన్నారు.
ముఖ్యంగా పని చేయని మీటర్లు కలిగి ఉన్న వాణిజ్య కనెక్షన్ వినియోగదారులకు నోటీసులు ఇచ్చి జరిమానా విధించడానికి కసరత్తు చేయాలని ఆయన అధికారులకు సూచించారు. మీటర్ లేని వాణిజ్య కనెక్షన్లకు 15 రోజుల్లో ఏఎంఆర్ మీటర్లను బిగించడానికి చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్ కుమార్, డైరెక్టర్ ఆపరేషన్ – 2 స్వామి, సీఈవో రవిచంద్రన్ రెడ్డి, సీజీఎంలు, జీఎంలు, డీజీఎంలు, అధికారులు పాల్గొన్నారు.