కామారెడ్డి మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం
పట్టణ అభివృద్ధికి రూ.300 కోట్ల ప్రత్యేక నిధులు..
కామారెడ్డి (CLiC2NEWS): కామారెడ్డి మున్సిపాలిటీపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసింది. ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబ్బీర్ అలీ సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని తన నివాసంలో నూతన మున్సిపల్ ఛైర్ పర్సన్ ఇప్పా ఉమారాణి శ్రీనివాస్ ముదిరాజ్, కౌన్సిలర్లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రాజకీయాలు, పట్టణ అభివృద్ధి ప్రణాళికలు, స్థానిక ఎమ్మెల్యే తీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు.

సమిష్టి కృషితోనే అభివృద్ధి
”ఎన్నికల వరకే పార్టీలు.. ఆ తర్వాత అందరి సహకారంతో కామారెడ్డిని అభివృద్ధి చేసుకుందాం” అని షబ్బీర్ అలీ ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ మద్దతుతో కలిసి 22 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు, 11 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్ల అండతో ఉమారాణి చైర్మన్ గా ఎన్నికయ్యారని, వైస్ చైర్మన్ పదవి బీఆర్ఎస్ కు దక్కిందని ఆయన వివరించారు. అందరం కలిసికట్టుగా పట్టణాన్ని అవినీతి రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దుదామని పిలుపునిచ్చారు.
రూ.500 కోట్ల నిధుల లక్ష్యం – రూ.300 కోట్లు ఖరారు
కామారెడ్డి అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. నిజామాబాద్ స్మార్ట్ సిటీకి రూ.వెయ్యి కోట్లు ఇస్తున్న నేపథ్యంలో, కామారెడ్డికి కూడా రూ.500 కోట్లు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరానన్నారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన సిఎం, ప్రత్యేక నిధుల కింద రూ.300 కోట్లు ఇచ్చేందుకు హామీ ఇచ్చారని.. ఇప్పటికే పట్టణంలో రూ.200 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
తాగునీరు, మౌలిక సదుపాయాలు
పట్టణ ప్రజల ప్రధాన సమస్య అయిన తాగునీటి ఎద్దడిని శాశ్వతంగా దూరం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. 80 కిలోమీటర్ల మేర అంతర్గత పైప్‌లైన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, మార్చి చివరి నాటికి తాగునీటి సమస్యకు పూర్తి పరిష్కారం లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపడతామని, వచ్చే నెలలో డిప్యూటీ సీఎం చేతుల మీదుగా అండర్ గ్రౌండ్ సబ్ స్టేషన్ పనులకు శంకుస్థాపన చేస్తామన్నారు.
తన రాజకీయ జీవితం తెరిచిన పుస్తకమని, 45 ఏళ్లలో తనపై ఒక్క చిన్న కేసు కూడా లేదని గుర్తు చేశారు. గతంలో కేవీఆర్ కు రాజకీయ జన్మనిచ్చింది తానేనని, ఆయనకు ఎమ్మెల్సీ బి-ఫారం ఇస్తే టికెట్ అమ్ముకుని పారిపోయారని ఎద్దేవా చేశారు. “ఆకాశం మీద ఉమ్మితే అది మన మొహం మీదే పడుతుందని ఎమ్మెల్యే గుర్తుంచుకోవాలి” అని హితవు పలికారు.
పాలకవర్గానికి హెచ్చరిక
కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు ప్రజలు హర్షించేలా పనిచేయాలని, అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని షబ్బీర్ అలీ హెచ్చరించారు. తనకు మంచి పేరు తెచ్చేలా, పారదర్శకమైన పాలన అందించాలని నూతన పాలకవర్గానికి దిశానిర్దేశం చేశారు.
Kamareddy News: ఇంట్లో నుండి బీరువా, నగదును ఎత్తుకెళ్లిన దుండగులు