కాగజ్ నగర్ లో సామల సదాశివ మాస్టారు విగ్రహావిష్కరణ నేడు

తెలుగు సాహితీ సదస్సు అధ్వర్యంలో..

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): డాక్టర్ సామల సదాశివ 11 మే 1928 వ సంవత్సరం దహేగాం మండలం తెనుగు పల్లె లో తమ అమ్మమ్మ ఇంట్లో జన్మించారు. సదాశివ తల్లి పేరు చిన్నమ్మ. సదాశివ తండ్రి సామల నాగయ్య పంతులు, వారు ప్రధానోపాధ్యాయునిగా పనిచేసినారు. అతడు ఉత్తమ ఉపాధ్యాయులని ఈ నాటికీ అతని శిష్య ప్రశిష్యులు చెప్పుకుంటారు.

సదాశివ గారు కూడా గొప్ప ఉపాధ్యాయునిగా పేరు గాంచినారు. సదాశివ ఉపాధ్యాయునిగా తొలుత కాగజ్ నగర్ లొనే పనిచేసినారు. అతని శిష్యులు ఈనాటికీ మాస్టారు అని గౌరవంగా చెప్పుకుంటారు.

చిన్న నాటినుండి సదాశివ గారికి సాహిత్యం పట్ల అభిరుచి ఉండేది. పద్యాలు రాయడం మొదలు పెట్టిన తర్వాత ఆనాటి గొప్ప సంస్కృత పండితులు శ్రీ కప్ప గంతుల లక్ష్మణ శాస్త్రి గారి వద్ద వ్యాకరణాంశాలు నేర్చుకొని గొప్ప పండితునిగా పేరు గాంచినారు. సదాశివ గారి పద్యాలు ధారా రమ్యంగా నిర్దుష్టంగా ఉంటాయి. నవలలు కథానికలు కూడా రాసినారు. ఐదవ తరగతి, ఏడవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకాలు కూడా రాసినారు. ఏడవ తరగతి తెలుగు వాచకం లో కొమురం భీము చరిత్ర రాసి భీము గురించి తొలి సారిగా లోకానికి పరిచయం చేసినాడు. అందుకే “కొమురం భీము“  సినిమా నిర్మించిన అల్లాని శ్రీధర్ సదాశివ గారికి కృతజ్ఞతలతో.. అని రాసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. రెండు విశ్వవిద్యాలయాలు సదాశివ గారిని డాక్టరేట్ పట్టాతో సత్కరించినాయి.

సదాశివ అసంఖ్యాక అవార్డులు అందుకున్నారు అందులో రాజీవ్ ప్రతిభా పురస్కారం, కళారత్న హంస పురస్కారం చెప్పుకోదగ్గవి. సదాశివ గారికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది తద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఖ్యాతి ఢిల్లీ వరకు ప్రసరించింది. సదాశివ గారు 7 ఆగస్టు 2012 శ్రావణ బహుళ పంచమి రోజు స్వర్గస్తులైనారు.
సదాశివ గారు తెలుగుతో పాటు ఉర్దూ, ఫారసి, ఆంగ్లం, హిందీ, మరాఠీ సంస్కృత భాషల్లో పండితులు. ఉర్దూ, ఫారసి భాషల నుండి తెలుగులోనికి, తెలుగు నుండి ఉర్దూలోకి అనువాద రచనలు చేసిన అనుభవం సదాశివ గారికి ఉన్నది. ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యులుగా వుంటూ అకాడమీ కోసం చాలా పుస్తకాలు రాసినారు.అనువాదాలు చేసినారు.

శాసనసభ్యులు కోనేరు కొనప్ప

సిర్పూర్ నియోజకవర్గ శాసనసభ్యులు కోనేరు కొనప్ప మాట్లాడుతూ..
“నాకు సామల సదాశివ యెడల అవ్యాజమైన ప్రేమ ఉన్నది, ఈ గడ్డ పై జన్మించి సాహిత్య రంగం లో ఇంతటి పేరు ప్రతిష్టలు సంపాదించి వెనక బడిన ఆదిలాబాద్ జిల్లాలో మరింత వెనక బడిన దహేగాం మండలం లోని తెనుగు పల్లె అనే ఒక కుగ్రామం లో జన్మించి ఇంతటి పేరు ప్రతిష్టలు సంపాదించడం సామాన్య మైన విషయం కాదు… ఆవిధంగా తమ జిల్లా కు మండలానికి ఇంత పేరు తెచ్చి పెట్టిన సదాశివ గారి విగ్రహం నెల కొల్పాలనే నా కోరిక ఈరోజు తీర బోతున్నది..“ అని ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు.

“సదాశివ పరమ పదించారని తెలియ గానే నేను సదాశివ గారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడి సదాశివ గారి ఆస్తికలు ప్రాణ హిత లో కలుప వలసింది గా కోరగానే వారు నా మట మీద వారి ఆస్తికలు ప్రాణహిత నదిలో కలిపారని, ఆ కార్యక్రమం రోజు అన్ని ఏర్పాట్లు చేసి ఒక వైపు వర్షం కురుస్తున్నా స్వయంగా అందరికి భోజనాలు ఏర్పాటు చేసి స్వయంగా వడ్డించి సదాశివ మాస్టారు మీద నాకు ఉన్న అభిమానాన్ని చాటు కున్నాను“ అని గుర్తుచేసుకున్నారు.

స్థానిక కవులు, కళాకారులు మాట్లాడుతూ ఈ నాడు సాహిత్య రంగం లో పేరు గాంచిన ఒక పండితుని విగ్రహాన్ని సొంత ఖర్చులతో నిర్మించి ఆవిష్కరించే ఎం.ఎల్.ఏ. కోనప్ప తప్ప మరొకరు కనిపించరు అనే విషయం అతిశయోక్తి కాదు అది నిజమని మన కళ్ల ముందే కనిపిస్తున్నది అని వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

తెలుగు సాహితీ సదస్సు అధ్వర్యంలో విగ్ర‌హావిష్క‌ర‌ణ‌

విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఈ రోజు (బుధ‌వారం) ఉదయం 11 గంటలకు జరుగును. కావున సాహితీ ప్రియులు, సదాశివ సర్ అభిమానులు, బంధు మిత్రులు సకాలంలో విచ్చేసి కోవిడ్19 నిబంధనలు పాటిస్తూ ఈ కార్యక్రమమును విజయవంతము చేయవలసిందిగా నిర్వాహకులు ఒక ప్రకటన లో తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.