రామగుండం ఫెర్టిలైజర్స్‌లో ఉత్పత్తి నిలిపివేయండి: పిసిబి
రామగుండం (CLiC2NEWS): పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఫెర్టిలైజర్స్‌లో ఉత్పత్తి నిలిపివేయాలంటూ కాలుష్య నియంత్రణ మండలి (పిసిబి) ఉత్తర్వులు జారీ చేసింది. పరిశ్రమలో వారం రోజుల పాటు తనిఖీలు నిర్వహించింది. సంవత్సర కాలంగా ఈ పరిశ్రమలో ఉత్పత్తి జరుగుతోంది. అధికారికంగా మే 26వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ కర్మాగారంను ప్రారంభిస్తారని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ పరిశ్రమపై గత కొంతకాలంగా అనేక ఫిర్యాదులు వచ్చాయి. గ్యాస్ లీకేజి తదితర అంశాలపై పలుమార్లు స్థానికులు ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో రామగుండం ఎమ్మెల్యే స్పందించి ఫిర్యాదు చేయడంతో పరిశ్రమలో పిసిబి తనిఖీలు నిర్వహించింది.
ఈ పరిశ్రమలో 12 లోపాలున్నట్లు గుర్తించారు. లోపాలను సరిచేసే వరకు కర్మాగారాన్ని మూసేయాలని సూచించారు. ప్రమాదాలు అధికంగా జరిగే అవకాశం ఉన్నా.. సిబ్బందికి, స్థానిక ప్రజలకు సంబంధించి భద్రతా చర్యలు తీసుకోలేదని పిసిబి అధికారులు వివరించారు. మరోవైపు తనిఖీల్లో భాగంగా రూ. 12 లక్షల గ్యారెంటీ సొమ్ము జప్తు చేశారు.