తెలంగాణ నేతన్న దేశంలోనే ప్రత్యేకం: కెటిఆర్‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): సిఎం కెసిఆర్ నాయ‌క‌త్వంలో ప్ర‌తి సంవ‌త్స‌రం జాతీయ‌ చేనేత దినోత్స‌వాన్ని తెలంగాణ‌లో ఘ‌నంగా జ‌రుపుకుంటున్నాం అని ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కెటిఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణ నేత‌న్న‌ల‌కు దేశంలో ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ పీపుల్స్‌ ప్లాజాలో నిర్వహించిన వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు. అనంతరం, చేనేత కళాకారులతో ఆయన ప్రతిజ్ఞ చేయించారు.

2018 నుంచి కొండా ల‌క్ష్మ‌ణ బాపూజీ పేరుతో అద్భుత‌మైన చేనేత‌ క‌ళాకారుల‌ను స‌త్క‌రించి, అవార్డులు అందిస్తున్నామ‌ని తెలిపారు. అవార్డుతో పాటు న‌గ‌దు పుర‌స్కారం రూ. 25 వేల‌ను అందించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ఈ ఏడాది 31 మంది చేనేత‌ క‌ళాకారుల‌ను స‌త్క‌రించుకున్న‌ట్లు కేటీఆర్ పేర్కొన్నారు. 2014కి ముందు చేనేతకు బడ్జెట్‌లో రూ.70 కోట్లే కేటాయింపులు ఉండేవని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చాక రూ.1200 కోట్ల కేటాయింపులు చేసినట్లు తెలిపారు. చేనేత మిత్ర ద్వారా 50 శాతం రాయితీ ఇస్తున్నామని ప్రకటించారు. 50 శాతం రాయితీ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వెల్లడించారు. చేనేత వస్త్రాలు ధరించి నేతన్నలకు చేయూతనివ్వాలని సూచించారు.

డ‌బుల్ ఇక్క‌త్, ఆర్మూర్ ప‌ట్టుచీర‌లు, జ‌రిచీర‌లు, సిద్దిపేట గొల్ల‌భామ చీర‌లు తెలంగాణ స‌మాజంలో అంద‌రి ముందు క‌ద‌లాడుతున్నాయి. ఆధునిక‌మైన టెక్నాల‌జీని జోడించి కొత్త డిజైన్ల‌ను రూపొందిస్తున్నామ‌ని తెలిపారు. కొత్త కొత్త ఆలోచ‌న‌ల‌తో వ‌చ్చే నేత క‌ళాకారుల‌ను ప్రోత్స‌హిస్తున్నామ‌ని పేర్కొన్నారు.

జాతీయ చేనేత దినోత్స‌వ సంద‌ర్భంగా చేనేత క‌ళాకారుల‌చే మంత్రి కేటీఆర్ ప్ర‌తిజ్ఞ చేయించారు.

‘భార‌తీయ చేనేత వ‌స్ర్తాలు.. క‌ళానైపుణ్యానికి సాంస్కృతిక వార‌స‌త్వ సంప‌ద‌కు ప్ర‌తీక‌లు. మ‌న ఈ వార‌స‌త్వ సంప‌ద‌ను ప్రోత్స‌హిస్తాన‌ని, కాపాడుతాన‌ని, ఆద‌రిస్తాన‌ని రాష్ర్ట ప్ర‌భుత్వ పిలుపు మేర‌కు నేను చేనేత వ‌స్త్రాలను ధ‌రిస్తాన‌ని, అలానే నా కుటుంబ స‌భ్యులు, బంధుమిత్రులు ధ‌రించేట‌ట్లు కృషి చేస్తాన‌ని జాతీయ చేనేత దినోత్స‌వ సంద‌ర్భంగా ప్ర‌తిజ్ఞ చేస్తున్నాను’.

Leave A Reply

Your email address will not be published.