తెలంగాణ తొలి పొద్దు పొడుపు కాళన్న

హక్కులు అడగమన్నావు

ఉద్యమం నడప మన్నావు

మంచి కోసం గొడవ పడమన్నావు

పుట్టుక, చావునీదైతే బతుకు ప్రజలదేనన్నావు

అన్యాయాన్ని ఎదిరిస్తే ఆరాధ్యుడన్నావు

పాలకులపై అక్షరాయుధాలు సంధించి ప్రజాకవివయ్యావు

తెలంగాణ ప్రజల ఆర్తివి నీవు

పెండకు,పేడకు బేధం చూపావు

కంపును ఇంపును వినసొంపుగా చెప్పావు

బడి భాష చెప్పావు , పలుకు బడులు తెలిపావు

అన్య భాషల్లో సకిలించవద్దన్నావు

మాతృభాష మమకారాన్ని ఎలిగెత్తి చాటావు

ఘనుడవో కాళన్న

వాసన నూనెల వైభోగం, మాసిన తలల అభాగ్యం

అంటూ అసమానతలపై కొరడా ఝళిపించిన వైతాళికుడవు

ఉదయం రాదను కోవటం నిరాశ,

ఉదయం అట్లనే ఉండాలను కోవటం దురాశ

కొత్త లోకం పోకడను చాటి చెప్పిన కవి బంధువు

దేవుడు, దేవతలు, రాక్షసులు ఎవరూ లేరూ

జగమంతా మనిషి అస్ధిత్వమే నంటూ

మనుషుల చేష్టలను విప్పిన కవితా నేస్తం

నాగుల చవితి ఘన చరిత్ర వినిపించి

సమాజ విషనాగులను పొడిచి చంపలేని చేతకాని తనంపై గళ మెత్తిన రుద్ర మూర్తివి

ఆత్మకు అవమానం జరిగినప్పడు దవడ పళ్ళు రాలగొట్టమన్నవిప్లవ యోధుడవు

కాళన్నా నిన్న ఎట్ల మరుతుమన్నా

ఎద ఎదలో గుర్తుంటవు, రోజూ యాదికొస్తవు

తెలంగాణ తొలిపొద్దుపొడుపు నీవు

-ఎస్‌.వి.రమణా చారి,
సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు, హైదరాబాద్‌

Leave A Reply

Your email address will not be published.