స్థానిక సంస్థల అభివృద్ధికి సమృద్ధిగా నిధులు..

జనగామ (CLiC2NEWS): స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమృద్ధిగా నిధులు ప్రత్యేకంగా కేటాయించిందని జిల్లా పరిషత్ చైర్మన్ పాకాల సంపత్ రెడ్డి తెలిపారు. గురువారం జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా పరిషత్ సీఈవో అధ్యక్షతన జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ శివలింగయ్య, శాసనమండలి సభ్యులు పోచంపల్లి శ్రీనివాస రెడ్డి
పాల్గొన్నారు.
వ్యవసాయం, పంచాయతీ, వైద్యం, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ పనులు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు తదితర ప్రధాన అంశాలపై సుదీర్ఘంగా చర్చ కొనసాగింది. గ్రామాల పురోభివృద్ధికి ఈ నిధులు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ముందుగా వ్యవసాయంపై జిల్లా వ్యవసాయ అధికారి రాధిక 2021- 22 సంవత్సరంలో పంట సాగు వివరాలను వివరిస్తూ సబ్సిడీ విత్తనాలు రాయితీపై అందిస్తున్నామని, యాసంగి పంట కాలానికి వరికి బదులుగా ప్రత్యామ్నాయ ఆరు తడి పంటలపై అన్ని గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. జాతీయ ఆహార భద్రతా పథకం కింద పప్పు దినుసుల సాగును ప్రోత్సహిస్తున్నామని, ఎరువుల కొరత లేదని తెలిపారు.
జిల్లా వైద్య శాఖ అధికారి మహేందర్ మాట్లాడుతూ జిల్లాలోని 30 పడకల ఆసుపత్రులను ప్రభుత్వం అభివృద్ధి పరచాలని సంకల్పంతో వైద్య విధాన పరిషత్ పరిధిలోకి తీసుకున్నట్లు తెలియజేస్తూ ఇకపై ఆసుపత్రి అభివృద్ధికి అధిక నిధులు మంజూరు అవుతాయని తద్వారా ప్రభుత్వ ఆసుపత్రులలో అభివృద్ధి వేగవంతంగా ఉండనున్నదని తెలియజేశారు. పంచాయతీరాజ్ అధికారి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్యక్రమంతో పనులు చేపడుతున్నట్లు తెలియజేశారు. శాఖ ద్వారా 756 సిసి రోడ్స్, 268 డ్రైనేజీలు, 55 మెటల్ రోడ్స్ చేపట్టామన్నారు.
ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమృద్ధిగా నిధులు ప్రత్యేకంగా కేటాయించిందన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో అభివృద్ధి పనులను చేపట్టాలన్నారు. మేకలగట్టు భూముల విషయంలో మార్చి 5వ తేదీ లోగా సమస్యను పరిష్కరిస్తామన్నారు. బచ్చన్నపేట లో చెట్టు తొలగించడం సరికాదని తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామన్నారు.
శాసనమండలి సభ్యులు పోచంపల్లి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. స్థానిక సంస్థలను అభివృద్ధి పరిచేందుకు 500 కోట్లు కేటాయించిన ఘనత దేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్రానికి దక్కిందన్నారు. తొలుత 250 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు వైద్య కళాశాల మంజూరుకు కృషి చేస్తామన్నారు .ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా మౌలిక సదుపాయాలు కల్పిస్తూ నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు మంజూరైన నిధులతో ప్రాధాన్యతగల పనులను చేపట్టి మార్చి 31 నాటికి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సిటీ స్కాన్ అంబులెన్స్ ల ఏర్పాటుకు వైద్య శాఖ మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్తా మన్నారు. అలాగే జిల్లా పరిషత్ నూతన భవనానికి చర్యలు తీసుకుంటామన్నారు.
జిల్లా కలెక్టర్ శివలింగయ్య మాట్లాడుతూ.. ప్రజా ప్రతినిధులు నేరుగా నన్ను కలిసి సమస్యలు తెలియజేయవచ్చు అన్నారు.. జిల్లాలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల స్థలాలకు సర్వే చేయించి హద్దులు ఏర్పాటు చేస్తామని నక్ష తో పాటుగా మ్యాప్ ను అందజేస్తామన్నారు. మేకలగట్టు భూములను సర్వే చూపిస్తామని త్వరలోనే నివేదిక ఇస్తామన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ జడ్పీ సీఈఓ విజయలక్ష్మి జిల్లా అధికారులు జడ్పీటీసీలు ఎంపీపీలు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.