Hyderabad: సత్వర ఆరోగ్య సేవలకు ప్రత్యేక యాప్

హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని జలమండలి ఉద్యోగుల ఆరోగ్య సేవల కోసం ప్రత్యేక యాప్ రూపొందించారు. బోర్డు పరిధిలో హెల్త్ కార్డు ఉన్నవాళ్లకు ఆరోగ్య సేవల్ని మరింత సులభతరం చేసేందుకు ‘ మెడ్ ఫ్లాష్’ అనే మొబైల్ అప్లికేషన్ తయారు చేశారు. ఖైరతాబాద్ లోని ప్రధాన కార్యాలయంలో జలమండలి ఎండి అశోక్ రెడ్డి ఈ అప్లికేషన్ ను ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఎండి మాట్లాడుతూ.. హెల్త్ కార్డులు ఉన్న ఉద్యోగులకు ఇలాంటి క్యాష్ లెస్ సర్వీస్ అందించడం దేశంలోనే మొదటి సారి. జలమండలిలో ఉద్యోగులు, పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్స్ దాదాపు 6685 మందికి హెల్త్ కార్డులు ఉన్నాయి. వీరితో పాటు వీరి మీద ఆధారపడిన వారందరు.. దీని ద్వారా ఏడాదికి రూ.3 లక్షల వరకు ఉచిత సేవలను పొందవచ్చు.ఈ యాప్ వినియోగం గురించి ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.
హెల్త్ కార్డు ఉన్న ఉద్యోగులకు సత్వర ఆరోగ్య సేవలు అందించేందుకు ఈ యాప్ తీసుకొచ్చారు. ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ తలెత్తినప్పుడు ఈ యాప్ ఉపయోగించి సేవల్ని పొందవచ్చు. యాప్ ద్వారా ఆ వివరాలు నమోదు చేసుకుంటే ఏజెన్సీ వాళ్లు వెంటనే స్పందించి.. ఆరోగ్య వివరాలు, మంచి వైద్యం అందించే ఆసుపత్రులను కూడా సూచిస్తారు. అవసరమైతే.. అంబులెన్స్ ను కూడా ఇంటి దగ్గరకు పంపించే సౌకర్యాన్నీ కల్పించారు.