సింగరేణి యాజమాన్యం అప్రమత్తం.. కరోనా బారినపడితే వారం రోజుల సెలవులు
కొత్తగూడెం (CLiC2NEWS): కరోనా కేసులు దేశవ్యాప్తంగా విజృంభిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ప్రతీరోజు 2 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో కూడా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం అప్రమత్తమైంది. ఉద్యోగులు కరోనా బారిన పడితే వారం రోజుల ప్రత్యేక సెలవును సింగరేణి యాజమాన్యం మంజూరు చేస్తున్నట్లు సింగరేణి బొగ్గు సంస్థల డైరెక్టర్లు ఎస్. చంద్రశేఖర్, ఎస్, బలరామ్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో సింగరేణి వ్యాప్తంగా కరోనా పరిస్థితులపై సోమవారం కొత్తగూడెం నుంచి అన్ని ఏరియాల జిఎంలతో వారు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
గతంలో కరోనా సోకిన ఉద్యోగులకు కేంద్ర రాష్ట్ర మార్గదర్శకాలకు అనుగుణంగా 14 రోజుల ప్రత్యేక సెలవులు ఇచ్చామని, ప్రస్తుతం మూడో దశ కరోనా వ్యాప్తిలో కరోనా మార్గదర్శకాలను కేంద్రం సడలించిందని తెలిపారు. వారం రోజుల ఐసోలేషన్ తర్వాత కోలుకున్న ఉద్యోగులు విధుల్లో పాల్గొనాలన్నారు. వారికి మళ్లీ కరోనా నిర్ధారణ పరీక్షలు అవసరం లేదన్నారు.
913 యాక్టివ్ కేసులు
ప్రస్తుతం సింగరేణిలో 913 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 382 మంది ఉద్యోగులు, 415 మంది వారి కుటుంబసభ్యులు, 116 పొరుగు సేవల సిబ్బంది క్వారంటైన్లో ఉన్నారు.
ఈ సమావేశంలో సింగరేణి భవన్ జిఎం జి. సురేందర్, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఎస్ భాస్కర్, డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ బాలకోటయ్య, కొత్తగూడెం నుంచి జిఎం, వెల్ఫేర్, సిఎస్ ఆర్ కె. బసవయ్య తదితర అధికారులు పాల్గొన్నారు.