ఏడాదిలో 350 మందికి పైగా నకిలీ డాక్టర్లు పట్టివేత!
Fake Doctrors: గ్రామాలు, నగరాలు ..తేడా లేకుండా నకిలీ వైద్యులు దర్శనమిస్తున్నారు. ఎలాంటి ఆర్హతలు లేకుండా వైద్యులుగా చెలామణి అవుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇలాంటి నకిలీ , అర్హతలేని వైద్యులపై రాష్ట్ర వైద్యమండలి దృష్టి సారించింది. తెలంగాణ వైద్యమండలికి అందిన ఫిర్యాదుల మేరకు సోదాలు చేపట్టారు. హైదరాబాద్‌లోని ఒక్క మల్కాజిగిరి లో 10 మంది నకిలీ వైద్యుల గుట్టురట్టయింది. ఖమ్మం జిల్లాలో 41 మందిపై కేసులు నమోదయ్యాయి. ఈ ఒక్క ఏడాదిలోనే ఏకంగా 350 మందికి పైగా నకిలీ వైద్యులు పట్టుబడినట్లు సమాచారం.
నకిలీ వైద్యులు సొంత క్లినిక్‌లు ఏర్పాటు చేసుకొని చట్టవిరుద్ధంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మందుల దుకాణాలతో కుమ్మక్కయి అవసరానికి మించి నొప్పి మాత్రలు, యాంటీ బయటిక్స్, స్టెరాయిడ్లు, ఇస్తున్నారు. దీంతో రోగులు అస్వస్థతకు గురై కొన్ని సందర్భాలలో ప్రాణాలు కోల్పోతున్నారు. నకిలీ వైద్యుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అర్హతల్లేని వైద్యులను గుర్తిస్తే ఫిర్యాదు చేయాలని రాష్ట్ర వైద్యమండలి సూచించింది. ఎన్ ఎంసి చట్టం ప్రకారం అర్హతల్లేకుండా వైద్యం చేస్తే ఏడాది జైలుశిక్ష , రూ.5లక్షల జరిమానా ఉంటుంది.