Kamareddy: బిసి విద్యార్థులకు అన్యాయం
కామరెడ్డి (CLiC2NEWS): జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కల్పించకపోవడంతో విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో తీవ్ర అన్యాయం జరుగుతుందని జిల్లా బిసి విద్యార్థి సంఘం అధ్యుక్షులు నీల నాగరాజు అన్నారు. పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు ఎటువంటి షరతులు లేకుండా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చి.. బీసీ విద్యార్థులకు షరతులు విధించడం అన్యాయం అన్నారు. బీసీ విద్యార్థులకు పదివేల లోపే ర్యాంక్ వస్తే ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామని చెప్పడం సిగ్గు చేటని. ఆ ఫీజు రీయింబర్స్మెంట్ కూడా పూర్తిగా ఇవ్వకుండా కేవలం ముప్పై ఐదు వేల రూపాయలు ఇవ్వడం సరి కాదన్నారు. అదే విధంగా స్కాలర్‌షిప్, ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరారు. బాసర ట్రిపుల్ ఐటీ అడ్మిషన్లలో కూడా బీసీలకు అన్యాయం జరిగిందని అన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల బడుగు వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను కోల్పోతున్న పరిస్థితి ఉందని ఎస్సీ,ఎస్టీ,బీసీ అర్హులైన విద్యార్థులు అందరూ ఈడబ్ల్యూఎస్ వలన నష్టపోతున్నారన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కేటగిరీవాళ్లకు అత్యల్ప కటాఫ్ మార్కులు 564 కాగా అదే మార్కులు వచ్చిన బీసీ,ఎస్సీ,ఎస్టీ వర్గాల విద్యార్థులకు సీట్లు రాని పరిస్థితి ఏర్పడింది. కావున రిజర్వేషన్ విషయంలో సమీక్ష జరిపి ఆర్థిక వెనుకబాటుదలపై ఆధారపడుతున్నదా లేక మరో రకమైన సామాజిక అన్యాయానికి దారి తీస్తుందా అని ఆలోచన చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.దయాకర్, నర్సింలు, మోహాన్ తదితరులు పాల్గొన్నారు.