బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి: సిపి అంబర్ కిషోర్
రామగుండం (CLiC2NEWS): బాధితుల ఫిర్యాదులపై పోలీసు అధికారులు తక్షణమే స్పందించాలని రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం ఆయన బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల మన్ననలు పొందే లాగా పోలీసులు జవాబుదారీ తనంతో ఉండాలన్నారు. వారు ఫిర్యదు చేసిన వెంటనే స్పందించాలని సూచించారు. వారికి నమ్మకాన్ని కలిగించడంతో పాటు, పోలీస్ వ్యవస్థ పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించాలంటే ప్రతి పోలీస్ ఉద్యోగి నిజాయితీ, నిబద్ధతతో విధులు నిర్వహించాలి. ప్రజల సమస్యలకు తక్షణ స్పందనతోపాటు, మర్యాదపూర్వకంగా వారి ఫిర్యాదులు ఆలకించాల్సిన బాధ్యత అందరిపై ఉందని సిపి పేర్కొన్నారు.
బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ చేరుకున్న కమిషనర్‌కు పోలీస్ అధికారులు పూలమొక్కలను అందజేసి స్వాగతం పలికారు. తనిఖీల్లో భాగంగా వివిధ విభాగాల పని తీరును పోలీస్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ కు సంబంధించిన పలు రికార్డులను తనిఖీ చేయడంతో పాటు, పెండింగ్ కేసులు, కోర్టు కేసులు, ప్రస్తుతం దర్యాప్తులో వున్న కేసులకు సంబంధించి క్షుణ్ణంగా తనిఖీ చేసి.. అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ తనిఖీల్లో పెద్దపల్లి డిసిపి కరుణాకర్, పెద్దపల్లి సిఐ ప్రవీణ్ కుమార్ , బసంత్ నగర్ ఎస్.ఐ స్వామి పాల్గొన్నారు.
Also Read: TTD: వచ్చే నెల 7న శ్రీవారి ఆలయం మూసివేత