కామారెడ్డిలో పాఠ‌శాల వ‌ద్ద ఉద్రిక్త‌త‌.. సిఐ, ఎస్ఐకి గాయాలు

కామారెడ్డి (CLiC2NEWS):  జిల్లా కేంద్రంలోని జీవ‌దాన్‌ పాఠ‌శాల వ‌ద్ద ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. విద్యార్థితో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన ఉపాధ్యాయుడిని శిక్షించాలంటూ త‌ల్లిదండ్రులు ఆందోళ‌న‌కు దిగారు. పాఠ‌శాల‌లో చ‌దువుతున్న ఓ విద్యార్థిని ప‌ట్ల పిఇటి టీచ‌ర్ అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన‌ట్లు ఆమె తల్లి దండ్రులకు తెలిపింది. దీంతో త‌ల్లిదండ్రులు మంగ‌ళ‌వారం పాఠ‌శాల‌కు వ‌ద్ద‌కు వ‌చ్చి, ఉపాధ్యాయుడిని నిల‌దీసి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విష‌యం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు పాఠశాల వ‌ద్ద‌కు వ‌చ్చి ఆందోళ‌న చేప‌ట్టాయి.

ఈ ఘ‌ట‌న గురించి తెలుసుకున్న కామారెడ్డి మున్సిప‌ల్ ఛైర్ ప‌ర్స‌న్ గ‌డ్డం ఇందుప్రియ కొంత‌మంది మున్సిప‌ల్ కౌన్సిల‌ర్‌లతో క‌ల‌సి పాఠ‌శాల‌వ‌ద్ద ఆందోళన చేప‌ట్టారు. విద్యార్థిపై వికృత చేష్ట‌ల‌కు పాల్ప‌డిన పిఇటిని అరెస్టు చేయాల‌ని డిమాండ్ చేశారు.

సిఐ, ఎస్ ఐకి గాయాలు

కామారెడ్డి డిఎస్‌పి నాగేశ్వ‌ర‌రావు ఆధ్వ‌ర్యంలో పోలీసులు పెద్ద ఎత్తున పాఠ‌శాల వ‌ద్ద బందోబ‌స్తు నిర్వ‌హించారు. విద్యార్థి త‌ల్లిదండ్రులు పాఠ‌శాల వ‌ద్ద టీచ‌ర్‌ను శిక్షించాల‌ని డిమాండ్ చేస్తూ ఆందోళ‌న‌కు దిగ‌డంతో పోలీసులకు – విద్యార్థి త‌ల్లిదండ్రులు, ఆందోళ‌నకారుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం చోటుచేసుకుంది.  దీంతో ప‌లువురికి గాయాల‌య్యాయి. ఉద్రిక్త‌ల కార‌ణంగా కామారెడ్డి-నిజాంసాగ‌ర్ రోడ్డు రెండు గంట‌ల పాటు వాహ‌నాల రాక‌పోక‌ల‌కు అంత‌రాయం ఏర్ప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో ప‌ట్ట‌ణ సిఐ చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి, దేవునిప‌ల్లి ఎస్ఐ రాజారామ్‌ల‌కు గాయాల‌య్యాయి. ప‌రిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్ఝ్ చేశారు. దీంతో ఉంద్రిక్త‌త స‌ద్దుమ‌ణిగింది.

Leave A Reply

Your email address will not be published.