ఈ నెల 7న ఆర్‌టిసి సమ్మె .. సిబ్బందికి యాజమాన్యం బహిరంగ లేఖ..

హైదరాబాద్ (CLiC2NEWS): మే 7వ తేదీన రాష్ట్రంలో ఆర్‌టిసి జెఎసి సమ్మెకు పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా నగరంలో భారీ ఎత్తున కవాతు నిర్వహించనుంది. తమ సమస్యలను పరిష్కరించాలని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, విధిలేని పరిస్థితుల్లో సమ్మె నోటీసులు కూడా ఇచ్చినట్లు అర్‌టిసి జెఎసి ఛైర్మన్ వెంకన్న వెల్లడించారు. అయినాసరే , యాజమాన్యం చర్చలకు ఆహ్వానించకపోయేసరికి సమ్మెకు పిలుపునిచ్చునట్లు సమాచారం. సమ్మె సన్నద్ధతలో భాగంగా కవాతును ఆర్‌టిసి కళాభవన్ నుండి బస్‌భవన్ వరకు నిర్వహిస్తోంది. ఈ కావాతు దృష్ట్యా పోలీసులు భారీగా మోహరించారు.
సిబ్బందికి యాజమాన్యం బహిరంగ లేఖ..
టిజిఎస్ ఆర్‌టిసి సిబ్బంది ఈ మే 7న సమ్మెకు సిద్దమవుతున్న నేపథ్యంలో యాజమాన్యం ఉద్యోగులకు బహిరంగ లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వ, ఆర్‌టిసి సంస్థ పరిస్థితులను వివరిస్తూ.. తల్లిలాంటి ఆర్‌టిసి ని కాపాడుకునేందుకు సమ్మె ఆలోచనను విరమించుకోవాలని సిబ్బందికి యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. ఉద్యోగుల సంక్షేమం విషయంలో యాజమాన్యం ఏ మాత్రం రాజీపడబోదని హామీ ఇచ్చింది. సమ్మె పేరుతో ఉద్యోగలను బెదిరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని లేఖలో పేర్కొంది.
టిజిఎస్ ఆర్‌టిసి ఆర్ధిక పరిస్థితి గురించి తెలిసిన విషయమే .. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి యాజమాన్యం కట్టుబడి ఉంది. దీని గురించి సిఎం , రవాణా మంత్రి ఇప్పటికే స్పష్టతనిచ్చారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటూ అభివృద్ధి పథంలో నడుస్తోన్న సంస్థకు , ఉద్యోగులకు సమ్మె తీరని నష్టం కలిగిస్తుంది. సమ్మె సమస్యలకు పరిష్కారం కాదు.. 2019లో జరిగిన సమ్మె, కొవిడ్ వలన ఆర్‌టిసి మనుగడే ప్రశ్నార్థకంగా మారిన సంగతి తెలిసిందే. మీ సమిష్టి కృషి వలనే అన్ని సంక్షోభాలనుండి బయటపడి , ప్రజల మన్నలను చూరగొంటున్న సమయంలో సమ్మె చేయడం శ్రేయస్కరం కాదు అని తెలిపింది.
ఎస్మా చట్టం ప్రకారం.. ఆర్‌టిసి సమ్మెలు నిషేధం. ప్రజలకు రవాణా పరమైన ఇబ్బందులు కలగకుండా సేవలందిస్తూ.. సంస్థ మేలు కోసం ఆలోచించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.
ఒక వర్గం తమ మనుగడ కోసం చెప్పే మాటలకు ప్రభావితమై సమ్మెకు వెళ్తే .. సంస్థతో పాటు ఉద్యోగులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. సమ్మె పేరుతో ఉద్యోగులను ఎవరైనా బెదిరించినా, విధులకు ఆటంకం కలిగించినా బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆర్‌టిసి యాజమాన్యం తమ లేఖలో పేర్కొంది.